పాతబస్తీలో లెక్కలు మారిన ఎన్నికల ప్రచారం

వివాదాస్పద వ్యాఖ్యలతో వేడెక్కించే మజ్లిస్ ఎన్నికల ప్రచార శరళిలో ఈ సారి అనేక మార్పులు చోటు చేసుకున్నాయని భోగట్టా. ఎంఐఎం ఎప్పటిలాగే భావావేశ ఉపన్యాసాలను కొనసాగిస్తూనే, కొత్త పంథాకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. ఇది పాతనగరంలో చర్చనీయాంశంగా మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి రాబోయే ఎన్నికల కోసం మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతవరకూ అర్థరాత్రి గల్లీ సమావేశాలు, చౌరస్తాల్లో సాగే చిన్నచిన్న సభలు, పగటిపూట పాదయాత్రలు.. ఇలా ప్రచారం సాగేది. అయితే వీటిలో ఎక్కడ చూసినా పురుషులే కనిపించేవారు. మహిళలు కనిపించేవారు కాదు. అయితే ఈసారి ఈ తీరుకు భిన్నంగా ప్రచారంలో మహిళా భాగస్వామ్యాన్ని కల్పించారు. ఎంఐఎం నేతల్లో త్రిపుల్ తలాఖ్ పై నెలకొన్నఆందోళన కారణంగా ఈ విధమైన సమావేశాలు నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పైగా ఇటువంటి సభల్లో త్రిపుల్ తలాఖ్‌ను బీజేపీ ఎన్నికల ఎత్తుగడగా ఆపార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణిస్తున్నారని సమాచారం.

దీనికితోడు ఎవరైనా అకారణంగా త్రిపుల్ తలాఖ్ చెబితే వారిని మజ్లిస్ పార్టీ బహిష్కరిస్తుందని చెబుతున్నరని భోగట్టా. ఈ విధమైన ప్రచారంతో ముస్లిం మహిళల్లో తమ పార్టీపట్ల భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. పైగా ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి చూపుతామని ఎంఐఎం నేతలు హామీలిస్తున్నారని సమాచారం. కాగా ఇంతవరకూ హైదరాబాద్ లోని బహదూర్‌పురా, టోలిచౌకి, మొగల్‌పురా తదితర ప్రాంతాల్లో ఇటువంటి సమావేశాలు జరిగాయని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వివిధ ప్రాంతాల్లో ఇటువంటి సమావేశాలు నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇదిలావుండగా చాంద్రాయణగుట్టలో సయ్యద్ షహజాదీని బీజేపి తమ అభ్యర్థిగా నిలబెట్టింది. దాంతో ఎంఐఎం ఆమెను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పాతబస్తీలో మజ్లిస్‌పార్టీకి గట్టి పట్టున్న విషయం విదితమే. ఓటు బ్యాంకు కూడా అధికంగానే ఉంది. ఇక్కడ జరిగే ఎన్నికల్లో అభ్యర్థి కంటే పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపుమహిళా పొలింగ్‌ శాతం ప్రతి ఎన్నికల్లో తక్కువగా నమోదవుతూ వస్తోంది. దీనికి అనేక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. దీనిని గుర్తించిన మజ్లిస్‌ ఈసారి మహిళా ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది. అందుకే సమావేశాలు నిర్వహించి, వారి ఓటింగ్ పెంచే దిశగా కృషి చేస్తున్నదని భోగట్టా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.