10 పర్సంట్‌తో కేసీఆర్‌కు 100 పర్సంట్ చెక్

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కంటున్న కేసీఆర్‌కు మోదీ నిన్న తీసుకున్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల నిర్ణయంతో భారీ షాక్ తగిలింది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలన్నీ మోదీ కోసమేనన్న వాదన ఒకటున్నప్పటికీ… మాట మీద నిలబడే నైజం లేని కేసీఆర్ తనకు ఎంతవరకు సహకరిస్తారన్న అనుమానం మోదీలో ఉండనే ఉంది. అయితే… ఎన్నికల తరువాత అవసరాల కోసం ఆయన్ను ఇంతకాలం ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. అదేసమయంలో కేసీఆర్ కూడా మోదీకి మన అవసరం ఉందని గుర్తించి పనులు చక్కబెట్టుకుంటూ వస్తున్నారు.. అలాగే, అవకాశం కుదరాలే కానీ ఫెడరల్ ఫ్రంట్ సీట్లను అడ్డంపెట్టుకుని ఆటాడించాలన్న ప్లానులోనూ ఉన్నారు. కానీ… ఇప్పుడు మోదీ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించడంతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు వృథా ప్రయాసగానే మిగులుతాయి. అంతేకాదు… ఇలాంటి ఊతకర్రల అవసరమూ మోదీకి రాకపోవచ్చు. పైగా తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని చెప్పి ఆ తరువాత సోనియాకు హ్యాండిచ్చిన చరిత్ర ఉన్న కేసీఆర్‌ను మోదీ అంత ఈజీగా నమ్మే పరిస్థితీ లేదు. అందుకే… ఎవరి సాయం అవసరం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మోదీ నిన్నటి నిర్ణయంతో కేసీఆర్ గొంతులో పచ్చి వెలక్కాయ పడిందనే చెప్పాలి. ఎన్నికల తరువాత తాను కట్టిన కొత్త కూటమి మద్దతు లేకుండా మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని కేసీఆర్ ఇంతకాలం కలలు కంటూ వచ్చారు. ఇప్పుడు ఆ కలలు భగ్నమయ్యాయి. అన్యాయం, అక్రమం, అంతా ఎన్నికల గిమ్మిక్కు అంటూనే కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు సైతం పార్లమెంటులో బీజేపీకి మద్దతిస్తామని చెబుతుండడం మోదీ కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్ ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. ఇలాంటి పరిస్థితిలో కేసీఆర్ తోక ఎగరేసే అవకాశం పోయినట్లే.
అంతేకాదు… మోదీ నిర్ణయం ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణ వంటి చోటా బీజేపీకి లాభం కలిగించొచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ చతికిలపడినా మళ్లీ ఈ దెబ్బకు లోక్ సభ సీట్ల విషయంలో బెటరయ్యే అవకాశమూ ఉంది. దీంతో… తెలంగాణలో ఉణ్న 17 లోక్ సభ సీట్లలో ఎంఐఎంది ఒకటి పోగా మిగతా పదహారూ మావే అంటున్న కేసీఆర్ ఇప్పుడు అంకెలు సవరించుకోవాల్సిన అవసరమూ రావొచ్చు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.