ఎన్‌టీఆర్‌.. వైఎస్సార్‌.. వంగ‌వీటి.. వాట్‌నెక్ట్స్‌?

సినిమా చూపిస్త మావా… ఎన్నిక‌ల ఓట్లు రాల‌తాయా మావా.. రాజ‌కీయ తెర‌పై బ‌యోపిక్స్‌తో త‌మ నేత‌ల బ‌యోపిక్స్ తీసేందుకు దాదాపు అన్ని పార్టీలు సిద్ధ‌మ‌య్యాయి. ఆ సినిమా వ‌ల్ల ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఎంత వుంటుంద‌నేది పక్క‌న‌బెడితే.. పోయినోళ్లంద‌రూ మంచోళ్లే అన్న‌ట్లుగా అన్న‌గారి సినిమా నుంచి వైఎస్సార్‌, వంగ‌వీటి వ‌ర‌కూ దాదాపు అన్ని పార్టీలు త‌మ ఎత్తుగ‌డ‌ల‌కు మాధ్య‌మంగా వెండితెర‌ను ఎంచుకున్నాయి. ల‌క్ష్మీపార్వ‌తి పెళ్లిత‌రువాత ఎన్‌టీఆర్ జీవితాన్ని చూపాల‌నుకున్న వ‌ర్మ‌.. ఆ తరువాత ఎందుకో చేతులెత్తేశారు. ఇప్పుడు అదే సినిమాను ల‌క్ష్మిపార్వ‌తి మాజీ సారీ.. మొద‌టి భ‌ర్త వీర‌గంధం భుజాన కెత్తుకున్న‌ట్లు తెలుస్తోంది. దానిలో చంద్ర‌బాబును విల‌న్‌గా చూపాల‌నుకుంటున్నారు. తాజాగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఏకంగా బాల‌య్య‌.. ఎన్‌టీఆర్ పాత్ర‌ను పోషిస్తూ త‌ల‌పెట్టిన సినిమా ప‌ట్టాలెక్కింది. అయితే తొలిరోజు చంద్ర‌బాబు, లోకేష్, జూనియ‌ర్ ఎన్‌టీఆర్ రాక‌పోవ‌టం. చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాబోయే ఎన్నిక‌ల నాటికి సినిమా విడుద‌ల చేయ‌టం ద్వారా ఎమోష‌న‌ల్‌ను.. టీడీపీ సొమ్ము చేసుకోవాల‌ని భావిస్తుందా అనేది ప్ర‌తిపక్షాలు సంధిస్తున్న విమ‌ర్శ‌. మ‌రోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా.. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జీవితాన్ని వెండితెర‌పై ర‌క్తిక‌ట్టించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. వైఎస్ పాత్ర‌ను పోషించేందుకు త‌మిళ హీరో సూర్య దాదాపు అంగీక‌రించిన‌ట్లుగానే వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సీఎంగా ప‌నిచేసిన ఆరేళ్ల వ్య‌వ‌ధిలో వైఎస్ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నాడనే  చెప్పాలి. సీఎం గాక‌ ముందు ఫ్యాక్ష‌న్‌నేత‌గా ముద్ర‌ప‌డినా.. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చాలా కాలం వేచిచూడాల్సి వ‌చ్చింది కూడా.  వైఎస్ జీవిత చ‌రిత్ర‌లో ఎవ‌ర్ని విల‌న్‌లుగా చూప‌తార‌నేది కూడా ప్ర‌శ్నార్ధ‌కం. మూడో నేత వంగ‌వీటి మోహ‌న‌రంగా.. 80 వ ద‌శ‌కంలో రాజకీయంగా కీల‌క ప‌రిణామాల‌కు కార‌ణ‌మైన నాయ‌కుడు. గ‌తంలో రంగా సోద‌రుడు  రాధా హ‌త్యోదంతంపై చైత‌న్య‌ర‌థం సినిమా తీశారు. వంగవీటి మ‌ర‌ణం త‌రువాత‌.. వ‌ర్మ ఇటీవ‌ల కాలంలో వంగ‌వీటి తీసినా అది పూర్తిగా త‌మ నాయ‌కుడిని విల‌న్‌గా చిత్రీక‌రించార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వచ్చింది. జీవి నాయుడు అనే స‌హ‌న‌టుడు.. వంగ‌వీటి పూర్తి సినిమా తాను తీస్తానంటూ ప్ర‌క‌టించాడు. దాదాపు క‌థ కూడా ఫైన‌ల్ అయిన‌ట్లు స‌మాచారం.
త‌మ నాయ‌కుల సినిమాలు తీయ‌టం వారి ఇష్ట‌మే అయినా.. దీని వెనుక రాజ‌కీయ‌ప్ర‌యోజ‌న‌మే కీల‌క‌మ‌నే గుస‌గుస‌లు వినిపించ‌ట‌మే ఇంత‌టి
చ‌ర్చ‌కు కీల‌క ప‌రిణామం. ముగ్గురు నేత‌లు.. మూడు సామాజిక‌వ‌ర్గాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న వ్య‌క్తులు కూడా. దీని ప్ర‌భావం ఆయా వ‌ర్గాల్లో
లేనిపోని క‌క్ష‌ల‌కు, ప్ర‌తీకార వాంఛ‌ల‌కు దారితీస్తే.. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్యేకాదు.. సామాజికంగా మ‌రింత ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తే
అవ‌కాశాలు లేక‌పోలేదనే ఆందోళ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.