మరోసారి తాత పేరు కలిసేలా.. తారక్ రెండో కొడుకు పేరిదే

వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రెండో కొడుకు పుట్టిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఓ వైపు సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటూనే.. మరోవైపు రెండో కొడుకుతో సరదాగా గడుపుతున్నాడు. అప్పుడప్పుడు అభిమానుల కోసం సోషల్ మీడియాలో మెరుస్తున్నాడు. తన రెండో కుమారుడు పుట్టిన సందర్భాన్ని పురష్కరించుకుని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా ఓపెన్ చేశాడు తారక్. ఇప్పుడు ఏం చెప్పాలన్నా సోషల్ మీడియా ద్వారానే చెబుతున్నాడు. తాజాగా తన రెండో కుమారుడికి నామకరణం చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. దీంతో తారక్ అభిమానులు తెగ ఖుషీ అయిపోతూ.. బుల్లి తారక్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఎన్టీఆర్‌కు తన తాత, స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. తన మొదటి కుమారుడికి కూడా ఆయన పేరు కలిసేలా అభయ్ రామ్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు మరోసారి తన తాతపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. గత నెల 14న ఎన్టీఆర్‌కు పుట్టిన రెండో కుమారుడికి ఈరోజు బారసాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారికి తన తాత పేరు కలిసేలా ‘‘భార్గవ రామ్’’ అని నామకరణం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు ఈ నందమూరి హీరో. అంతేకాదు, గతంలో తన బాబాయి, నందమూరి బాలకృష్ణ ‘‘భార్గవ రాముడు’’ అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తన కుమారుడికి అదే పేరు పెట్టడంతో నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.

ప్రస్తుతం తారక్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీరరాఘవ’లో నటిస్తున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్‌ డ్రాప్‌ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.