ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడానికి అసలు కారణం ఇదే

‘ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణగారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరుపున ఇప్పుడు మా సోదరి సుహాసిని గారు కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మీకు తెలిసిందే. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలి అని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాంక్షిస్తూ.. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ’ నందమూరి సుహాసిని కూకట్‌పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజు ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ విడుదల చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన చూసిన టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోయారు. సుహాసిని రాజకీయాల్లోకి రావడం ఆమె సోదరులకు ఇష్టం లేదన్న వార్తలకు వీరిద్దరూ ఇలా చెక్ పెట్టేశారు. అయితే, దీని తర్వాత కొన్ని సందర్భాల్లో సుహాసిని.. తన కోసం ప్రచారం చేయడానికి సోదరులిద్దరూ వస్తారని చెప్పారు. దీంతో టీడీపీ, నందమూరి మద్దతుదార్లలో ఆనందం వెల్లి విరిసింది.

తాజాగా తారక్, కల్యాణ్ రామ్ ఇద్దరూ తమ సోదరి సుహాసిని కోసం ప్రచారానికి రాకూడదని నిర్ణయించుకున్నారనే వార్త బయటికి వచ్చింది. దీనికి తగ్గట్లే వారు కూడా తమ పర్యటనకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ఎటువంటి దరఖాస్తూ చేసుకోలేదు. దీంతో ఈ వార్త నిజమేననే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. వీరిద్దరూ ఇప్పుడు షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లే ప్రచారానికి రాలేకపోతున్నారనే ప్రచారమూ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీళ్లు ప్రచారానికి రాకపోవడానికి అసలు కారణం వేరే ఉందట. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మొదట సుహాసిని కోసం ప్రచారం చేయాలని భావించారట. కానీ, తమ తండ్రి నందమూరి హరికృష్ణ చనిపోయిన సమయంలో అండగా ఉండి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడం మంచిది కాదనే ఉద్దేశంతోనే వీళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. దీంతో పాటు సినీ కెరీర్‌ విజయవంతంగా సాగుతున్నప్పుడు ప్రచారానికి వెళ్తే రాజకీయ శత్రువులు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయని వారిరువురూ భావించారని, అందుకే ప్రచారానికి రావడంలేదని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.