‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: సాయికొర్రపాటి, విష్ణు ఇందూరి
నిర్మాణ సంస్థ‌లు: ఎన్‌.బి.కె.ఫిలింస్, వారాహి చ‌ల‌న చిత్రం, విబ్రి
నటీనటులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్‌, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్, హన్సిక, పాయల్ రాజ్‌పుత్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం తదితరులు.
మ్యూజిక్: కీర‌వాణి
సినిమాటోగ్రఫీ: వీఎస్‌ జ‌్ఞాన‌శేఖ‌ర్

డైలాగ్స్: సాయిమాధ‌వ్ బుర్రా
ఆర్ట్: సాహి సురేష్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎంఆర్‌వీ ప్ర‌సాద్‌
కో- ప్రొడ్యూసర్స్: విష్ణు ఇందూరి, సాయికొర్ర‌పాటి
ప్రొడ్యూసర్స్: న‌ంద‌మూరి వ‌సుంధ‌రా దేవి, నందమూరి బాల‌కృష్ణ‌
స్టోరీ, డైరెక్షన్: జాగ‌ర్ల‌మూడి క్రిష్‌

బయోపిక్‌లు అంటేనే జయాపజాయాలకు సంబంధం ఉండదు. చరిత్ర ఆధారంగా తీసే సినిమాలు చరిత్రను సృష్టిస్తాయి. అలాంటి కోవలోకే చేరుతుంది ‘యన్.టి.ఆర్’. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దశ దిశలా చాటిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అంతటి మహానుభావుడి చరిత్రను సినిమాగా మలచడం సాహసంతో కూడుకున్న పనే. కానీ, ఆయన కుమారుడు ఈ సినిమాను తెలుగు ప్రజలకు అందించాలనుకునే మొదటి విజయం సాధించేశారు. అలాగే గొప్ప వ్యక్తుల జీవితాలను తెరకెక్కించేటప్పుడు సున్నితమైన అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి భాగమైన ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా బుధవారం విడుదలైంది. మరి ఇందులో బాలయ్య.. తన తండ్రి పాత్రను ఎలా పోషించాడు..? ఎన్టీఆర్ జీవితం ఎలా సాగింది..? ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది..?

క‌థ

ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే ఎవరికీ తెలియనిది కాదు. అయితే, ప్రస్తుత తరానికి ఆయన గొప్పదనం కచ్చితంగా తెలియాలి. అందుకే ఈ సినిమాను అదే విధంగా నడిపించారు. బ‌స‌వ‌తార‌కం(విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలో బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆల్బ‌మ్‌ను చూస్తున్న క్రమంలో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఇందులో ఎన్టీఆర్(బాలకృష్ణ) జీవితం గురించి వివరణ ఉంటుంది. అసలు ఆయన ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారు..? తన దృష్టిని సినిమాలపై ఎందుకు మళ్లించారు..? ఈ క్రమంలో ఎలాంటి కష్టాలను అనుభవించారు..? ఒక సక్సెస్‌ఫుల్ స్టార్‌గా ఎలా ఎదిగారు..? తెలుగుదేశం పార్టీ స్థాపనకు దారి తీసిన కారణాలేంటి..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే

ఎన్నో అంచనాలతో విడుదలైన చిత్రం ‘యన్.టి.ఆర్’. తెలుగు జాతి కీర్తిని ఎల్లలు దాటించిన గొప్ప వ్యక్తికి సంబంధించిన కథ కావడంతో అందరికీ ఆతృత ఉంటుంది. దీన్ని అదే రేంజ్‌లో చూపించాడు దర్శకుడు. బాలయ్య తన తండ్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడంతో ఈ సినిమాకి మరింత బలం చేకూరింది. అంతే స్థాయిలో డైలాగ్స్ చెప్పిన విధానం అందరికీ నచ్చుతుంది. ఓవరాల్‌గా ఎన్టీఆర్ కథానాయకుడు చాలా వరకు మెప్పించింది. ఎన్టీఆర్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇదో మంచి అవకాశమనే చెప్పవచ్చు. అయితే, నిడివి ఎక్కువవడం.. కొన్ని సన్నివేశాల్లో బాలయ్య సూట్ కాకపోవడం వంటివి ఇబ్బంది పెట్టినా.. బాలయ్య ఖాతాలో మరో సంక్రాంతి హిట్ వచ్చి చేరినట్లే. అయితే, పండుగకు విడుదలయ్యే మిగిలిన సినిమాల ఫలితాలను బట్టి దీని కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి.

నటీనటల పనితీరు
ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌ కనిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. తన తండ్రి పాత్రలో లీనమైపోయి బాలయ్య కనబరిచిన నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. విభిన్న గెటప్‌లలో కనిపించినా అన్నింటికీ సెట్ అయ్యాడనే అనిపిస్తుంది. అయితే, యుక్త వయసులోని ఎన్టీఆర్‌ను చూపించిన సమయంలో మాత్రం సెట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక, ఈ సినిమాలో మరో గొప్ప పాత్ర అంటే విద్యాబాలన్‌దే. బసవతారకం పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించారు. ఈ పాత్రకు ప్రాణం పోశారు. ఈ పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్రే. ఆయన పాత్రలో సుమంత్.. గత సినిమాల్లో కనబరచని నటనను చూపించాడు. అక్కినేని పాత్ర కూడా సినిమాలో చాలా సేపు ఉంటుంది. ఇక మిగిలిన నటులు తమ పరిధి మేర చక్కగా నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
అసలు ఈ సినిమాకు ఒప్పుకోవడమే దర్శకుడు క్రిష్ చేసిన పెద్ద సాహసం. సున్నితమైన అంశాలను చూపించే క్రమంలో అతడు చక్కని పనితీరును కనబరిచాడు. అభిమానులకు కావాల్సిన కోణాన్ని ఆవిష్కరిస్తూనే అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను ప్లస్ అయ్యాయి. అలాగే సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

బలాలు
* కథకు మూలం
* బాలకృష్ణ నటన
* విద్యాబాలన్ అభినయం
* భావోద్వేగ సన్నివేశాలు
* డైలాగ్స్
* బ్యాగ్రౌండ్ స్కోర్

బలహీనతలు
* ఫస్టాఫ్ సాగదీత, నిడివి
* ఎన్టీఆర్ యంగ్ ఏజ్‌లో బాలయ్య కనిపించిన తీరు

మొత్తంగా: ‘యన్.టి.ఆర్.. కథానాయకుడు’ బాలయ్య నట విశ్వరూపం

రేటింగ్: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.