ఎన్టీఆర్‌ను దించేశారుగా..!

అన్న నందమూరి తారక రామారావు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి దివి నుంచి భువికి విచ్చేశారా.? తెలుగు ప్రజల కష్టాలు తీర్చడానికి మన కోసం దిగొచ్చారా..? అనుకుంటున్నారా ఏంటీ..? మీ సందేహం నిజమే.. ఫొటోలో కనిపిస్తున్నది ఎన్టీఆరే. కానీ, దివంగత నేత నందమూరి తారక రామారావు మాత్రం కాదు.. ఆయన పాత్రలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ. అవునండీ నమ్మకం కలగట్లేదా..? అయితే ఈ ఫోటోని తదేకంగా చూడండి అందులో ఉన్నది ఎవరో అర్థమవుతుంది. హమ్మయ్యా.. ఇప్పటికి గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇది. స్వాతంత్ర్య దినోత్సవ (ఆగస్టు 15) కానుకగా ఒకరోజు ముందే ‘ఎన్టీఆర్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణను చూసిన వారందరూ అచ్చు ఎన్టీఆర్‌లా ఉన్నడే అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఈ పోస్టర్ అంత ఒరిజినల్ కాదని తెలుస్తోంది. ఈ ఔట్‌పుట్ తీసుకురావడం కోసం ఫొటోషాప్ టెక్నాలజీని వాడినట్లు సమాచారం. ఏదిఏమైతేనేం ఈ లుక్‌లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసిందీ చిత్ర బృందం. ఏమంటూ ఈ సినిమాకు దర్శకుడు తేజ తప్పుకున్నాడో గానీ, క్రిష్ ఆయన స్థానాన్ని భర్తీ చేయడం.. మరికొందరు గొప్ప నటులు ఈ సినిమాలో భాగమవడం వంటి కారణాలతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్రిష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమా రూపే పూర్తిగా మారిపోయినట్లు అనిపిస్తోంది. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, దీనిని రూపొందించారట. నిజానికి ఈ పోస్టర్‌లో అన్న నందమూరి తారక రామారావు తెలుగు వారి మదిలో నిలిచిపోయారు. ఇప్పుడు అదే ఫోజ్‌లో తన తండ్రిలా కనిపిస్తున్న బాలయ్య లుక్ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది.

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక విషయం సంచలనం అవుతోంది. ఎంతో మంది ప్రముఖ నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రను బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ పోషిస్తుండగా, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను దగ్గుబాటి రానా, వీరితో పాటు కొందరు ప్రముఖుల పాత్రల్లో కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.