మామా అల్లుడి ఎపిసోడ్ ప్రారంభం

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. బసవతారకమ్మ పాత్రలో నటిస్తోంది. వీరితో పాటు కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల ఏడాదిలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఎన్టఈర్ జీవితాన్ని ఎలా చూపించబోతున్నారు..? ఆయన పాత్రలో బాలకృష్ణ ఎలా చేయబోతున్నారు..? అనే అనుమానాలకు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో పుల్‌స్టాప్ పెట్టేసింది చిత్ర బృందం.

సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త సంచలనానికి తెరలేపుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బయటికొచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అల్లుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాత్రను రానా చేస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. ప్రస్తుతం చంద్రబాబు-ఎన్టీఆర్ మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన షూటింగ్ ఎన్టీయార్‌కు ఎంతో ఇష్ట‌మైన హైదరాబాద్‌లోని అబీడ్స్‌ ఏరియాలో ఉన్న ఇంట్లో జరుగుతోందని తెలుస్తోంది. ఈ షూటింగ్‌లో బాల‌కృష్ణతోపాటు నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ధారి రానా కూడా పాల్గొంటున్నాడు. దీన్ని బ‌ట్టి ప్రస్తుతం మామా, అల్లుళ్ల‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు సీన్ల షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.