ఎన్టీఆర్ బయోపిక్ వాయిదా.. కారణం ఎన్నికలే

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాద్య దైవం నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన కుమారుడు, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలోని కీలక పాత్రల కోసం పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను యంగ్ హీరో దగ్గుబాటి రానా, ఏఎన్నార్‌గా సుమంత్ చేస్తున్నాడు. వీరితో పాటు కొందరు ప్రముఖుల పాత్రల్లో కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితరులు నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎన్నికల ఏడాదిలో రాబోతున్న చిత్రం కావడంతో టీడీపీ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీగా ఆశలు పెంచుకున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ సంచలన విషయం బయటికి వచ్చింది.

ఎన్టీఆర్ జీవితంలో సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో విశేషంగా రాణించారు. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తామని చిత్ర బృందం ప్రకటించింది. మొదటి భాగాన్ని ‘ఎన్టీయార్ క‌థానాయ‌కుడు’ పేరుతో, అలాగే రెండో భాగాన్ని ‘ఎన్టీయార్ మహానాయకుడు’గా విడుద‌ల చేయ‌బోతున్నట్లు చిత్ర బృందం ఇది వరకు ప్రకటించింది. మొదటి భాగం సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 9వ తేదీన, రెండో భాగం కూడా జనవరి నెలలలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోందని చెప్పారు. అయితే, ఇప్పుడు నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగాన్ని అదే తేదీన విడుదల చేసి, రెండో భాగాన్ని మాత్రం ఏపీ ఎన్నికలకు ముందు విడుదల చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలకృష్ణ ఇప్పటికే డైరెక్టర్, సహా నిర్మాతలకు చెప్పేశాడని సమాచారం. ఇలా చేస్తే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుందనేది వారి ఆలోచనగా తెలిసింది. మరోవైపు, దీనిపై భిన్నా స్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత విడుదల చేయడానికి నిబంధనలు అడ్డు వస్తాయేమోనన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. మరి, చిత్ర బృందం అంతిమ నిర్ణయం ఎలా తీసుకుంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.