నోట్లరద్దుతో ఉగ్రవాదం పోయిందన్నారే.. ఇప్పుడేంటిలా..

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తీసుకున్న అత్యంత సాహసమైన నిర్ణయాల్లో ‘నోట్లరద్దు’ అతిపెద్దది. దేశంలో ఉన్న నల్ల కుబేరుల భరతం పట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ గొంతెత్తి చెప్పారు. అప్పటి వరకు ఉన్న రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించగానే సామాన్యులు ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. మోదీలాంటి నాయకుడు ఒక్కరుంటే చాలని కీర్తించారు. ఇక దేశం బాగుపడినట్టేనని సంతోషం వ్యక్తం చేశారు. అయితే అది జరిగిన వారం రోజులకు గానీ అసలు విషయం అర్థం కాలేదు. పన్నులు కట్టకుండా డబ్బులు దాచుకున్న వారిని ఇబ్బందిపెట్టడానికి చేసిన నోట్లరద్దు నిర్ణయం.. సామాన్యుడిని సుడిగుండంలో పడేసింది. దేశంలోని పేద ప్రజలందరూ నడిరోడ్డుపై పడ్డారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ఉన్న పాతనోట్లను మార్చుకోడానికి కిలోమీటర్ల మేర బారులు తీరిన క్యూలైన్లలో నిల్చోలేక నీరసించిపోయారు. అక్కడక్కడా ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వందరోజుల్లోగా తన నిర్ణయానికి ఫలితం వస్తుందని, అలా రాని పక్షంలో తనను ఉరితీయాలని ప్రధాని మోదీ ప్రకటించడంతో నిజమేనేమో అని ప్రజలు శాంతించారు. పెద్దాయన చెప్పినట్లు వందరోజులు వేచిచూద్దాం అనుకున్నారు. అయితే వంద కాదు.. కదా.. 150 రోజులు దాటినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఏటీఎంలలో ఎక్కడా డబ్బులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న విపక్షాలు నగదు కొరతపై ఒక్కసారిగా మోదీని నిలదీయడం మొదలు పెట్టాయి. అయినా మోదీ మాత్రం తన నిర్ణయం తప్పేనని ఒప్పుకోకపోగా.. తన చాణక్యం ప్రదర్శించారు. నోట్ల రద్దుతో దేశానికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని నిర్మూలించామని కొత్త విషయం చెప్పారు. ఉగ్రవాదులు తమ వద్ద ఉన్న పాత నోట్లు మార్చుకోలేరని, వాళ్లకు ఇబ్బందుల తప్పవని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో ఉగ్రవాదం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని భారతీయులకు కొత్త విషయం చెప్పారు.

అయితే ప్రధాని మోదీ అప్పుడు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఉన్నాయి. ఉగ్రవాదులు పెరిగిపోవడం కారణంగానే కశ్మీర్‌లో కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చేసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడులు శ్రుతిమించుతున్నాయని, భారత సైన్యం కూడా ఎదురుకాల్పులు చేయాల్సిందేనని, అవసరమైతే ఇంకో సర్జికల్ దాడికి కూడా సిద్ధమనేలా కేంద్ర హోంశాఖ సంకేతాలు పంపుతోంది. ఇప్పుడిదే విపక్షాలకు అస్త్రంగా మారింది. నోట్లరద్దుతో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయిందని చెప్పిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఉగ్రవాదం పెరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉగ్రవాదం పెరిగిందంటే.. నోట్లరద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైందని ప్రభుత్వ పెద్దలు ఒప్పుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకే కశ్మీర్‌లో పీడీపీతో తెగతెంపులు చేసుకుని, కాల్పుల విరమణకు స్వస్తి చెప్పారని ఆరోపిస్తున్నారు. ఎదుటివాడే రెచ్చగొట్టి కాల్పులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయులేం చేతకాని వాళ్లు కాదని, వాళ్లకు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని బీజేపీ చెప్పడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.