‘నోటా’ మూవీ రివ్యూ

నిర్మాణ సంస్థ: స‌్టూడియో గ్రీన్‌
నటీనటులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, ఎం.ఎస్‌.భాస్క‌ర్ త‌దిత‌రులు
సంగీతం: సి.ఎస్‌.శామ్‌
సినిమాటోగ్రఫీ: స‌ంతాన కృష్ణ‌న్‌, ర‌విచంద్ర‌న్‌
ఎడిటింగ్: రేమాండ్ డెర్రిక్
నిర్మాత‌: కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా
ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ శంక‌ర్‌

హీరోగా చేసింది నాలుగు సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ వస్తున్నాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అతడు చేసిన చిత్రమే ‘నోటా’. తెలుగు రాష్ట్రాలతో పాటు ఆ చిత్రం క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల్లో కూడా విడుద‌లైంది. రాజ‌కీయ నేప‌థ్యంతో కూడిన చిత్రాలు చేయ‌డానికి అగ్ర క‌థానాయ‌కులు సైతం ఆలోచిస్తుంటారు. కానీ, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థ‌ల ఎంపిక‌లో తాను ప్ర‌త్యేకం అని చాటుతూ రాజ‌కీయ ప్ర‌ధాన‌మైన ‘నోటా’ చేశారు. మరి ఈ సినిమా కూడా తన గత సినిమాలలా విజయం సాధించిందా..? యంగ్ సీఎంగా విజయ్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు..?

కథ
ముఖ్యమంత్రి వాసుదేవన్ (నాజర్) అనివార్య కారణాల వల్ల రాత్రికి రాత్రే తన పదవికి రాజీనామా చేస్తాడు. దీంతో అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలం గడుపుతున్న తన కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ)ను ముఖ్యమంత్రిని చేస్తాడు. మొదట్లో తన తండ్రి ఆదేశాల మేరకు డమ్మి ముఖ్యమంత్రిగా మేనేజ్ చేసిన వరుణ్.. మహేంద్ర (సత్యరాజ్) సహాయంతో క్రమంగా రాజకీయాలపై అవగాహాన తెచ్చుకుంటాడు. అదే సమయంలో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంటాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో వాసుదేవన్ బెయిల్‌పై విడుదలవుతాడు. అప్పుడు అతడిపై దాడి జరుగుతుంది. ఆ దాడిలో గాయపడిన వాసుదేవన్ కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి తన తండ్రిపై దాడి చేసిన వారిని కనిపెట్టేందుకు ప్రయత్నాలు జరుపుతాడు వరుణ్. ఈ ప్రాసెస్‌లో అతడికి ఊహించని నిజం ఒకటి తెలుస్తుంది. ఇంతకీ ఏంటా నిజం..? వాసుదేవన్‌పై దాడి చేసింది ఎవరు..? వరుణ్‌కు సహాయం చేసి మహేంద్ర ఎవరు..? ఈ సవాళ్లను వరుణ్ ఎలా అధిగమించాడు..? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ దేవరకొండకు ఈ సినిమా నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘నోటా’ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. రాజకీయాలకు సంబంధించి తీసుకున్న స్టోరీ లైన్‌ను నేరేట్ చేయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఆ రాజకీయాల్లో ఎదురయ్యే కొన్ని నాటకీయ పరిణామాలను, సమస్యలను ఆసక్తికరంగా చూపించలేకపోయారు. కథనం కూడా నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. పైగా సినిమాలో తమిళ నేటివిటీ కూడా ఎక్కువుగా కనిపిస్తోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకున్నా.. సినిమా ఆకట్టుకోదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయినా ఈ ‘నోటా’ చిత్రం ఓవరాల్ గా నిరుత్సాహపరిచినా సినిమాలోని కొన్ని అంశాలు విజయ్ అభిమానులను ఆకట్టుకోవచ్చు.

నటీనటుల పనితీరు
సినిమా సినిమాకు స్టైల్, నటన, బాడీ లాంగ్వేజ్‌లో వేరియేషన్ చూపిస్తున్న విజయ్ దేవరకొండ ‘నోటా’లోనూ ఆకట్టుకున్నాడు. యంగ్ సీఎంగా చాలా స్టైలిష్‌గా ఫ్రెష్ గా కనిపించాడు. తన మాడ్యులేషన్ అండ్ తన టైమింగ్‌‌తో అక్కడక్కడా.. తన మార్క్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తూనే.. ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తోనూ విజయ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్ మెహ్రీన్‌ పాత్ర హీరోయిన్‌కు తక్కువ సపోర్టింగ్ రోల్‌కు ఎక్కువలా ఉంది. మరో కీలక పాత్రలో నటించిన సంచనా నటరాజన్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది. కట్టప్ప సత్యరాజ్ తన నటనతో ఆకట్టుకుంటారు. ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్‌తో.. కొన్ని ఏమోషనల్ సీన్స్‌తో పాటు, పొలిటికల్ డ్రామా సీన్స్‌ను కూడా చాలా బాగా పండించారు. ఇక ఎప్పటిలాగే నాజర్ తన వైవిధ్యమైన నటన, వికృతమైన గెటప్‌తో ఆకట్టుకోగా.. హీరో ఫ్రెండ్‌గా కనిపించిన కమెడియన్ ప్రియదర్శి బాగా నటించాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేర ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు ఆనంద్ శంకర్ రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్‌కు తగ్గట్లు సరైన కథ కథనాలని రాసుకోలేకపోయారు. ఉన్న కంటెంట్‌ను ఆనంద్ శంకర్ స్క్రీన్‌పై ఆసక్తికరంగా మలచలేకపోయారు. సామ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తోంది. కానీ ఆయన అందించిన పాటలు మాత్రం అస్సలు ఆకట్టుకోవు. యస్. కృష్ణ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్‌గా, మంచి విజువల్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా చూపించారు. రేమండ్ ఎడిటింగ్ బాగుంది కానీ, సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత జ్ఞానవేల్‌ రాజా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు
* విజయ్ దేవరకొండ నటన
* బ్యాగ్రౌండ్ స్కోర్

బలహీనతలు
* కథ, కథనం
* సెకెండాఫ్
* పాటలు
* తమిళ్ నేటివిటి ఎక్కువగా కనిపించడం

మొత్తంగా: విజయ్ విజయాలకు ‘నోటా’తో బ్రేక్ పడింది

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.