విజయమ్మకు ఈ సారి నో టికెట్.. కారణమిదే..!

వైఎస్ విజయమ్మ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తల్లి. వైఎస్ మరణం తర్వాత బయటి ప్రపంచానికి తెలిసిన విజయమ్మ.. తనదైన రాజకీయంతో ఒకసారిగా హైలైట్ అయ్యారు. దివంగత నేత మరణం తర్వాత పులివెందులలో వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. కొద్దిరోజులకే తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం వైసీపీ తరపున మరోసారి ఉప ఎన్నికలో పాల్గొన్న ఆమె.. పులివెందులలో వరుసగా రెండోసారి విజయం సాధించారు. అవినీతి ఆరోపణపై వైఎస్ జగన్ జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఆ పార్టీ బాగోగులు దగ్గరుండి చూసుకున్నారు విజయమ్మ.

సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న వేళ.. కూతురు షర్మిళతో కలిసి పార్టీ బలోపేతానికి బాగా కృషి చేశారు. కొడుకును సీఎంగా చూడాలని ఉందని పదే పదే చెప్పే ఆమె.. అందుకోసం సలహాలు సూచనలు చేస్తుంటారు. విజయమ్మ గత ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. బిజెపి అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి దాదాపుగా ఆమె రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా..? లేదా..? అంటే చేయట్లేదనే సమాధానం వస్తోంది. వైఎస్ విజయమ్మ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదట. ఈ విషయాన్ని జగన్ ఎప్పుడో పార్టీ నేతలకు స్పష్టం చేసేశాడని సమాచారం.

అంతేకాదు, గత ఎన్నికల్లో ఆమెను పోటీకి నిలబెట్టం వల్ల తప్పు జరిగిపోయిందని జగన్ తెగ ఫీలయ్యాడని గుసగుసలు వినిపించాయి. విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేయడం వల్ల.. ఆమె గెలుపుకోసమే ఎక్కువ దృష్టి సారించాల్సి వచ్చిందని, దీని వల్ల వేరే స్థానాలను పట్టించుకోలేకపోయానని, అందుకే ఈ సారి పోటీకి నిలబెట్టడంలేదని జగన్.. తన సన్నిహితులతో చెప్పడని టాక్ వినిపిస్తోంది. దీంతో విజయమ్మ కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే పుకార్లకు బ్రేక్ పడినట్లయింది. అయితే, జగన్ ఆలోచన పార్టీకి మేలు జరిగేదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీఎం అభ్యర్ధిగా ఉన్న జగన్ ఏదో ఒక్క స్థానంపై దృష్టి సారించడం వల్ల మిగతా నాయకులు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.