మోదీజీ.. యూనిటీ ఎక్కడ..?

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. గుజరాత్‌లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాం వెనుక అంతరార్థం. కానీ, ఆ యూనిటీని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించలేకపోయింది. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న చందంగా ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని నిర్మించారని సగటు భారతీయుడు గర్వించాల్సిన రోజే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పొరపాటుతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 565 సంస్థానాలను తిరిగి భారతదేశంలో విలీనం చేసి దేశ సమైక్యతా సారథిగా దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు తగిన గౌరవం ఇచ్చేందుకు నర్మదా నదీ తీరాన ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో నిర్మించారు. విగ్రహాన్నైతే నిర్మించారు కానీ, అందులో పటేల్ భావజాలానికి మాత్రం తూట్లు పొడిచేలా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఐక్యతకు చిహ్నంగా ఏర్పాటు చేసిన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలోనే పప్పులో కాలేసిన మోదీ అండ్ కో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఐక్యతకు చిహ్నం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉన్న భాషల్లో తెలుగుకు చోటు కల్పించలేదు. భారతదేశంలో అత్యధిక మంది మాట్లాడుతున్న భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగు భాషకు శిలాఫలకంలో చోటు కల్పించలేదు. అంతేకాదు, దక్షిణాది నుంచి ఒక్క తమిళ భాషనే వాడినా.. అందులోనూ తప్పులు రాసి దాన్ని కొట్టేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై దక్షిణాది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు వారైతే మోదీ అండ్ కోపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇందులోనూ వివక్ష చూపించిందని మండి పడుతున్నారు. ఐక్యతకు చిహ్నమని చెప్పుకునే విగ్రహాన్ని ఆవిష్కరించిన రోజే ఇలా చేయడం వల్ల సర్దార్ ఆత్మ కూడా క్షోభిస్తుందేమోనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది గుజరాత్ ప్రభుత్వం చేసిన పొరపాటు చూపించే ప్రయత్నం చేసి తప్పించుకోవచ్చనే ఆలోచనలో పీఎంవో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రమే కావడం.. దీనికి ప్రధాని ముఖ్య అతిథిగా రావడం వంటి కారణాలతో వారు తప్పించుకోలేరని, దీనికి సమాధానం చెప్పాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.