పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వా…బాబోయ్ మాకొద్దు

వరంగల్‌, మెదక్‌ పార్లమెంటు ఉపఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు…ఆ త‌ర్వాత తాజాగా జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌లు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాలనే చవిచూసింది. ముందస్తు ఎన్నికల్లో అధికారం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేసి…కేవ‌లం 19 స్థానాలకు పరిమితమై అభాసుపాలైంది. మరోసారి ప్రతిపక్ష సీట్లో కూర్చునేందుకు సిద్ధమైంది. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి ప‌రిచ‌య వాక్యాలు. కునారిల్లిపోతున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు నాయ‌క‌త్వం వ‌హించేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు. క్లిష్ట పరిస్థితుల్లో కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఎందుకు రిస్కు తీసుకోవాలని భావిస్తున్నారు.
ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మార్పుపై చర్చ మొదలైంది. ముందస్తు ఎన్నికల్లో పార్టీ ఓటమితో ఉత్తమ్‌పై అంతర్గతంగా వ్యతిరేకత ఉన్నా…పైకి ఇప్పుడే మార్చాలని ఏ నాయకుడు బహిరంగంగా అనకపోవడం గమనార్హం. ఎన్నికల తర్వాత తమకే ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ, రేవంత్‌రెడ్డి, డికె అరుణ,దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వంటి నేతలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నట్టు తెలిసింది. వీరిలో భట్టి, శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి శాసనసభా పక్ష నేత పదవీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ ఓటమిపై ఇప్పటికే అధిష్టానానికి వ్యక్తిగత నివేదికలు పంపినట్టు తెలిసింది. కాగా, పార్టీ పరంగా మాత్రం అధిష్టానానికి నివేదిక పంపించకపోవడం పార్టీ నేతల్లో చర్చనీయాంశమవుతున్నది. ఎన్నికల్లో అధిష్టానం సొంత సర్వేలు చేయించుకున్నట్టుగానే…పార్టీ ఓటమికి సంబంధించిన కారణాలపై సొంతటీమ్‌ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. అధిష్టానం తెప్పించుకున్న నివేదికతోపాటు పార్టీ అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ జాతీయ కార్యదర్శులతో నేరుగా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఉత్త‌మ్‌ను మార్చితే అధ్యక్షుడిగా ఎవరుండాలనే అంశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినప్పటికి పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ పదవి చేపట్టేందుకు పలువురు ఆశావహ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. రెండేండ్లుగా అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసిన నాయకులు సైతం ఆ పదవి అంటేనే వెనకడుగు వేస్తున్నారు. ఇన్నాళ్లూ ఆ పదవికోసం ప్రయత్నించిన డికె అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మధుయాష్కీ, మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆ పదవి ఇప్పుడు తమకు అక్కర్లేదనే ధోరణిలో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు చూద్దాంలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలు అయిపోయేవరకు ప్రస్తుత అధ్యక్షుడిని కొనసాగించాలని అధిష్టానానికి గ్రీన్‌సిగల్‌ పంపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఆ పదవి చేపట్టి.. పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కో వస్తుందని, అనవసర తంటాలు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా డీలాపడిన ఈ సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి మళ్లీ ఓడిపోతే ఆ బదనాం మోయాల్సి వస్తుందని భయపడుతున్నారు. ఈ రెండు ఎన్నికల వరకు ఉత్తమ్‌ను కొనసాగించాలని పార్టీ నేతలు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.