జీఎస్టీ ఫైలు ఇంకా దిద్దుతూనే ఉన్నారు

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విష‌యంలోమ‌రో ఉప‌శ‌మ‌నం వ‌చ్చింది. చిన్న వ్యాపారులకు గొప్ప ఊరట లభించింది. మినహాయింపు పరిమితిని కేంద్రం రెట్టింపు చేసింది. ప్రస్తుతం రూ.20 లక్షల వార్షిక టర్నోవర్‌ వరకు జీఎస్టీ నమోదు నుంచి మినహాయింపుంది. దీన్ని రూ.40 లక్షలకు పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో గురువారం జరిగిన జీఎస్టీ మండలి 32వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక వార్షిక టర్నోవర్‌ రూ.40 లక్షలు దాటితేగానీ జీఎస్టీ చెల్లింపులు ఉండవన్నమాట. కాగా, కొండ ప్రాంత, ఈశాన్య రాష్ట్రాలకు ఈ పరిమితి ఇప్పుడు రూ.10 లక్షలుగా ఉంటే.. దాన్ని రూ.20 లక్షలకు పెంచారు. ఇక్కడ వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లింపులు జరుపాల్సిందే.
సమావేశం అనంతరం  జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ జీఎస్టీ కంపోజిషన్‌ స్కీం కింద టర్నోవర్‌ ఆధారంగా చిన్న వర్తకులు, వ్యాపారులు చెల్లిస్తున్న 1 శాతం పన్ను రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌ దాటినవారికే వర్తిస్తుందని తెలిపారు.  ప్రస్తుతం ఈ పన్ను వార్షిక టర్నోవర్‌ కోటి రూపాయలు దాటితే పడుతున్నది. ఏప్రిల్‌ 1 నుంచి మార్పు వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. రూ.50 లక్షలదాకా వార్షిక టర్నోవర్‌ ఉన్న సేవలు లేదా, వస్తు, సేవల కల్పనదారులు, సరఫరాదారులూ కంపోజిషన్‌ స్కీంను ఉపయోగించుకోవడానికి అర్హులని చెప్పారు. కంపోజిషన్‌ స్కీం కింద సేవల కోసం పన్ను రేటు 6 శాతంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయాలు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు ఊతమివ్వగలవని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణ రంగంలో జీఎస్టీ రేట్లకు సంబంధించి పరిశీలనకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా జైట్లీ ఈ సందర్భంగా చెప్పారు. దీనిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మండలి తీసుకున్న తాజా నిర్ణయంతో ఖజానాకు భారీగా ఆదాయం దూరం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. చిన్న వ్యాపారులకు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు జీఎస్టీ మినహాయింపునిస్తున్న నేపథ్యంలో రూ.5,200 కోట్ల రాబడి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కంపోజిషన్‌ స్కీం కింద తీసుకున్న నిర్ణయాలతో దాదాపు మరో రూ.3,000 కోట్ల ఆదాయం ప్రభావితం కావచ్చని అంటున్నారు. ఇప్పటికే జీఎస్టీ నెలసరి వసూళ్లు పడిపోతున్న వేళ.. గత నెల జరిగిన మండలి చివరి సమావేశంలోనూ తీసుకున్న నిర్ణయాలు సర్కారీ ఆదాయాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. జీఎస్టీ గరిష్ఠ శ్లాబైన 28 శాతం నుంచి చాలా వస్తు, సేవలను దిగువ శ్లాబుల్లోకి మార్చగా, 18, 12 శాతాల నుంచీ కొన్నింటిని తొలగించారు. మరికొన్నింటిపై పన్నును తొలగించగా, మొత్తం నాటి నిర్ణయాలతో రూ.5,500 కోట్ల ఆదాయం ఖజానాకు దూరమైంది.
జీఎస్టీ మండలి తీసుకున్న తాజా నిర్ణయాలు చిన్న వ్యాపారులకు గొప్ప ప్రయోజనాల్ని చేకూర్చేలా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. సీఐఐ, అసోచామ్‌, కేపీఎంజీ ఇండియాతోపాటు డెలాయిట్‌ ఇండియా, ఈవై ఇండియా వంటి ఏజెన్సీలూ హర్షం వెలిబుచ్చాయి. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఈ నిర్ణయాలు గొప్ప ఊరటను ఇవ్వగలవని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. పన్ను భారం తగ్గడం వల్ల వ్యాపారాభివృద్ధికి ఆస్కారముంటుందన్నారు. ఈ నిర్ణయాల వల్ల లక్షలాది చిన్న, మధ్యతరహా సంస్థలకు లబ్ధి చేకూరగలదని అసోచామ్‌ పేర్కొన్నది. కంపోజిషన్‌ స్కీంపై నిర్ణయాలనూ స్వాగతించారు.
నిర్మాణ రంగంపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గిస్తారనే ఊహాగానాల మధ్య సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్‌ నిరాశనే మిగిల్చింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సానుకూల నిర్ణయం ఉంటుందన్న ఆశలు ఆవిరయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ సమస్యలపై తాజా సమావేశంలో భిన్నమైన అభిప్రాయాలు నెలకొనడంతో కూలంకషంగా చర్చించడానికి ఏడుగురు సభ్యుల మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇచ్చే ప్రతిపాదనలపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని జైట్లీ తెలిపారు. దీంతో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి చెందేలా ప్రతిపాదనలు ఉంటాయన్న ఆశాభావాన్ని క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు జక్సేషా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటు గృహాలపై 8 శాతం జీఎస్టీని వసూలు చేస్తుండగా, ఇతర గృహాలపై 12 శాతం వడ్డిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.