తెలంగాణలో ఉప ఎన్నికలు రానట్లే

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌లకు హైకోర్టులో ఊరట లభించింది. వాళ్లిద్దరి శాసనసభ సభ్యత్వాల రద్దుపై స్టే విధించింది హైకోర్టు. ఫలితంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. వారి సభ్యత్వం రద్దుపై వచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆరు వారాల వరకు వాళ్లిద్దరి నియోజకవర్గాలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వవద్దని ఎన్నికల సంఘానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ నరసింహన్ మాట్లాడే సమయంలో వారిద్దరూ అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌పై వేటు పడింది. వారి సభ్యత్వాలను రద్దు చేయడంపై హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. అసలు సంబంధం లేని వారిని సైతం ఆ రోజు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని వారు వాదించారు.
ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వీడియోలు షీల్డ్ కవర్‌లో పెట్టి ఈనెల 22న కోర్టుకు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫలితంగా వాస్తవం ఏంటనేది తేలనుంది. వీడియో ఫుటేజ్ విషయంలో అనేక అనుమానాలు వెల్లువెత్తిన నేపధ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే ఉత్కంఠ నెలకుంది. కర్నాటక ఎన్నికలతో పాటు… ఉప ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది. ఆలస్యం అయితే ఉప ఎన్నికలు ఆగుతాయనే కారణంతోనే ఈ పని చేసింది. ఇప్పుడు కోర్టు స్టే విధించడంతో కేసీఆర్ సర్కార్ కింకర్తవ్యంపై సమాలోచనలు చేస్తున్నారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.