వైసీపీలో కొత్త టెన్షన్.. ముఖ్య నేతకు ఫోన్ చేసిన జగన్

2014 ఎన్నికల్లో ఎదురైన పరాభావానికి డీలా పడ్డ వైసీపీ.. 2019 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ సారైనా గెలిచి ఏపీలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఆ పార్టీ ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. గత ఎన్నికల్లో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని డిసైడ్ అయిన జగన్.. వచ్చే ఎన్నికల్లో నిలబెట్టబోయే అభ్యర్ధుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బలమైన చోట ఎలాంటి వారిని నిలబెట్టాలి..? బలహీనంగా ఉన్న స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలి..? అనే దానిపై ఎప్పటి నుంచో కసరత్తులు ప్రారంభించింది ఆ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే, వైసీపీకి కంచుకోట అయిన కడప జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుందట. ఇంతకీ ఏంటా సంఘటన..?

వైసీపీ బలంగా ఉన్న జిల్లాలో కడప ప్రధానమైనది. ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కూడా అదే జిల్లాలో ఉంది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ తొమ్మిదింటిని కైవశం చేసుకుంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు వైసీపీ తరపున జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి టీడీపీలోకి వచ్చేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. దీనితో పాటు ఇన్ని సంవత్సరాలలో వైఎస్‌ కుటుంబం పరిష్కరించలేని నీటి సమస్యను చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చారు. గండికోట ప్రాజెక్టుకి కృష్ణాజలాలను తరలించి.. అక్కడనుంచి పులివెందుల ప్రాంతంలోని చిత్రావతి, పైడిపాలెం ప్రాజెక్టులకు నీరందించారు. తద్వారా పులివెందుల కెనాల్స్‌కు నీటిని విడుదల చేశారు. దీంతో పులివెందుల ప్రజలకు తాగు- సాగునీటికి కొదవ లేకుండా పోయింది. వ్యవసాయపరంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలిగింది తెలుగుదేశం ప్రభుత్వం.

తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన దీక్ష వైసీపీలో కలవరం కలిగిస్తోందట. కడపలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం తమదే అనే భావనలో ఉన్న వైసీపీలో ఇప్పుడు పట్టుకుందట. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడు, సీఎం రమేష్ చేసిన దీక్షతో ఆ పార్టీ ఇమేజ్ బాగా పెరిగిపోయిందట. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న జగన్‌.. కడప జిల్లాలోని వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేతకు ఫోన్ చేసి, సీఎం రమేష్ దీక్ష గురించి చర్చించాడట. ఆయన దీక్షకు ప్రజాస్పందన ఎలా ఉంది..? దీని వల్ల వైసీపీ నష్టం ఏమైనా ఉందా..? అంటూ పలు రకాల ప్రశ్నలు అడిగాడట. దీనికి ఆ నేత ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు మన జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిందే’’ అని ఒక్క మాటతో సమాధానం చెప్పాడట. పరిస్థితి అర్థం చేసుకున్న జగన్.. త్వరలోనే కడపకు వస్తా అంటూ ఫోన్ పెట్టేశాడట. మరి జగన్.. తన కంచుకోటలో రాజకీయ సమీకరణలను వైసీపీకి అనుకూలంగా మలచుకోడానికి ఏం చేస్తాడో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.