కొత్త పార్టీ పెడుతున్న వైసీపీ మాజీ ఎంపీ

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. అధికార పార్టీతో సహా మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల కోసం సన్నద్దమవుతున్నాయి. ఇందుకోసం ప్రతి పార్టీ స్పీడు పెంచేశాయి. ఒకవైపు ఎన్నికల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసుకుంటున్నాయి. పార్టీలు చేసే హడావిడితో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. దీంతో ఏపీలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే నడిచింది. బీజేపీ, జనసేన కూడా టీడీపీతోనే కలిసి నడిచాయి. ఇక కాంగ్రెస్, విభజన ఎఫెక్ట్‌తో ఏపీలో అసలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ, జనసేనలు టీడీపీకి వ్యతిరేకమై వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుకి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ పాత నాయకులని కలుపుకొని పోతూ కొత్త ఉత్సాహంతో వచ్చే ఎన్నికలవైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పార్టీలు ఎన్ని ఉణ్న ఈ సారి కూడా టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొని ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, జనసేన కూడా కొంచెం ప్రభావం చూపగలిగే అవకాశాలూ లేకపోలేదు.

ఇంత హడావిడి మధ్య రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత ఓ రాజకీయ పార్టీని స్థాపించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఈనెల 24న పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నారని సమాచారం. కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. అనంతరం ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సమయంలో గీత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మహిళలకు గౌరవం దక్కడంలేదని చెప్పారు. అంతేకాదు, వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ఓ పొలిటికల్ స్టంట్ అని, పాదయాత్ర చేసినంత మాత్రాన ఆయన సీఎం కాలేరని చెప్పారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్నట్లు జగన్ మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆ మధ్య ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ల కోసం పలు పోరాటాలు చేస్తున్నారు గీత. ఆమె వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ, బీజేపీలో చేరబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఆమె ఏ పార్టీలో చేరకపోగా, కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఇప్పుడు ఈ వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.