కొత్త పార్టీలు వల్ల ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల ముందస్తు ఎన్నికలు అనివార్యమవ్వడంతో తెలంగాణలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ పార్టీ సహా మిగతా పార్టీలన్నీ బరిలోకి దిగేందుకు తహతహలాడుతుండడంతో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన రోజే అభ్యర్ధులను ప్రకటించడంతో మిగతా పార్టీలు కూడా స్పీడు పెంచేశాయి. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు మహాకూటమి ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నాయి. వీటికి తోడు భారతీయ జనతా పార్టీ, మజ్లీస్ పార్టీలు కూడా ప్రభావం చూపగలిగేవే. మరోవైపు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసన, సీపీఎంలు కూడా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పోటీ చేస్తే టీఆర్ఎస్ పార్టీకే మేలు జరిగే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో కొన్ని కొత్త పార్టీలు పురుడుపోసుకుంటున్నాయి.. మరికొన్ని పార్టీలు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సందర్భంగా ఈ పార్టీలన్నీ జనంలోకి రావాలని భావిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్ని వర్గాలకు తగిన న్యాయం జరగాలన్న నినాదంతో జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలో ‘తెలంగాణ ప్రజా పార్టీ’ ఏర్పడింది. అలాగే సామాజిక న్యాయం ఏజెండాతో చెరుకు సుధాకర్‌ నేతృత్వంలో ‘తెలంగాణ ఇంటి పార్టీ’, యువ శక్తితో సామాజిక మార్పే లక్ష్యంగా రాజకీయ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి నాయకత్వంలో ‘యువ తెలంగాణ పార్టీ’, కాసాని శ్రీనివాస్‌ నేతృత్వంలో ‘జై స్వరాజ్‌ పార్టీ’లు ఇప్పటికే ఏర్పటై ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటికి తోడు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, ప్రజానౌక గద్దర్ కూడా పార్టీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు మహాకూటమి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో చిన్న పార్టీల ఏర్పాటు వాటికి ప్రతిబంధకంగా మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలంటే ప్రతి సీటు కీలకమైన తరుణంలో చిన్నపార్టీల ఏర్పాటు ప్రధాన పార్టీల్లో చర్చకు తావిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన పార్టీల వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేకపోగా, లాభం చేకూరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త పార్టీల వల్ల టీఆర్ఎస్‌కు కూడా కొన్ని చోట్ల నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ నకిరేకల్‌లో, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో ప్రభావం చూపే అవకాశం ఉందని, తెలంగాణ ప్రజాపార్టీ జిట్టా బాలకృష్ణారెడ్డికి భువనగిరిలో మంచి పట్టు ఉందని టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.