బీజేపీకి కొత్త అర్థం చెప్పిన లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అధికార, ప్రతిపక్షాలు కూడా ఇలా పోట్లాడుకుని ఉండవు అనేంతగా సాగుతోంది టీడీపీ-బీజేపీ ఫైట్. గత ఎన్నికల్లో కలిసి పని చేసిన ఆయా పార్టీలు ఇప్పుడు ఉప్పు-నిప్పులా ఉంటున్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటున్నారు. విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటికి వచ్చేసింది. అప్పటి నుంచి కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తోంది. అంతేకాదు, తిరుపతి వెంకన్న సాక్షిగా భారత ప్రధాని మోదీ అప్పట్లో ఇచ్చిన హామీలను నీరుగార్చారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది.

ఎక్కడ మీటింగ్ జరిగినా.. మరే కార్యక్రమం అయినా.. రాష్ట్ర ప్రజలకు బీజేపీ చేసిన అన్యాయాన్ని వివరించి చెబుతోంది. మరోవైపు ఏపీలోని బీజేపీ నేతలు మాత్రం అక్కడి అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారు. కేంద్రం చాలా హామీలు నెరవేర్చిందని, ఏపీ ప్రభుత్వమే తప్పుడు సంకేతాలిచ్చి ప్రజలను మోసం చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో టీడీపీని నమ్మినంతగా, బీజేపీని అక్కడి ప్రజలు నమ్మడంలేదనేది వాస్తవం. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్న టీడీపీ ఇప్పటికే రెండు సార్లు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్నికూడా ప్రవేశ పెట్టింది. గత సమావేశాల్లో దీని నుంచి ఎలాగోలా తప్పించుకున్న బీజేపీ ఇప్పుడు మాత్రం అవిశ్వాసాన్ని ఆమోదించడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది.

ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బీజేపీని టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. టీడీపీ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో బీజేపీపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. పార్టీ కార్యక్రమాల్లో ప్రసంగాలు చేసే సందర్భంలో అప్పుడప్పుడూ తడబడే నారా లోకేష్.. బుధవారం మాత్రం రెచ్చిపోయారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు జనాలంతా ఆసక్తిగా ఆలకించారు. ఈ సందర్భంలోనే ఆయన బీజేపీకి కొత్త అర్థం చెప్పారు. అసలు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అని అందరికీ తెలుసు కానీ లోకేష్ మాత్రం ‘‘బీజేపీలో B అంటే భారతీయ జనతాపార్టీ, J అంటే జగన్మోహన్‌రెడ్డి పార్టీ, P అంటే పవన్‌కల్యాణ్‌ పార్టీ’’ అని కొత్త నిర్వచనం చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.