నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: శ్రీమ‌తి రాణి పోసాని
నిర్మాణ సంస్థ‌: సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్‌
తారాగ‌ణం: సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం: సురేశ్ ర‌గుతు
కూర్పు: ఛోటా కె.ప్ర‌సాద్‌
సంగీతం: అజ‌నీశ్ లోక్‌నాథ్‌
నిర్మాత : సుధీర్‌బాబు
ద‌ర్శ‌క‌త్వం : ఆర్‌.ఎస్‌.నాయుడు

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. కమర్షియల్ అంశాల కంటే విభిన్న తరహా చిత్రాల్లో నటించడానికే ఇష్టపడే అతడు ఎన్నో సినిమాల్లో తన అదృష్టాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో సక్సెస్‌లు రాకపోయినా దిగులు చెందకుండా తన ప్రయత్నాలు చేస్తూనే పోయాడు. తాజాగా ‘సమ్మోహనం’తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న సుధీర్ బాబు.. ఈ సారి నిర్మాత అవతారం ఎత్తాడు. త‌న తొలి ప్ర‌య‌త్నంగా ‘న‌న్ను దోచుకుందువటే’ నిర్మించాడు. రొట్టకొట్టుడు కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్తదనాన్ని వెతికే అతడు.. ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా రెండు పాత్రలు చేశాడు. ఈ ప్రయత్నంలో అతడు విజయం సాధించాడా..? ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా..?

కథ
కార్తీక్ (సుదీర్ బాబు) చాలా ఫోకస్డ్‌గా చాలా ప్రాక్టికల్‌గా ఉంటాడు. పని తప్ప అతడికి మరొకటి తెలీదు. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి మేనేజర్‌గా ఉన్న కార్తీక్ అంటే అందులోని ఉద్యోగులందరూ భయపడుతుంటారు. అమెరికా వెళ్లాలన్నదే అతడి గోల్. తన గోల్ కోసం కలలు కంటూ.. ప్లాన్ చేసుకుంటుంటాడు. కానీ కార్తీక్‌కు అతని పేరెంట్స్ పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఈ క్రమంలో ఆ పెళ్లి సంబంధాలు నుంచి తప్పించుకోవడానికి కార్తీక్, మేఘన (నభ నటేష్)అనే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ని తన గర్ల్ ఫ్రెండ్‌గా పేరెంట్స్ కి పరిచయం చేస్తాడు. ఇలా కొన్ని పరిణామాల అనంతరం కార్తీక్ మేఘన పరిచయం స్నేహంగా, ఆ స్నేహం కాస్త ప్రేమాగా మారుతుంది. కానీ కొన్ని సంఘటనల కారణంగా కార్తీక్ మేఘనను దూరంగా పెట్టాలని భావిస్తాడు. అసలు కార్తీక్ మేఘనను ఎందుకు దూరం పెట్టాలనుకుంటాడు..? అమెరికా వెళ్లాలన్న తన గోల్‌ను కార్తీక్ రీచ్ అయ్యాడా..? అస‌లు కార్తీక్ ఎవ‌రిని పెళ్లి చేసుకున్నాడు..? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
‘నన్ను దోచుకుందువటే’ అంటూ సుధీర్ బాబు నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నమే ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమా సింపుల్ అండ్ గుడ్ లవ్ స్టోరీగా సాగుతుంది. మొదటి భాగంలో వచ్చే సున్నితమైన సన్నివేశాలు మరియు ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగులుస్తాయి. ఇక హీరోయిన్ నాభ నటేష్ కూడా తన స్క్రీన్ ప్రజెన్స్‌తో గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. నటన పరంగా కూడా ఆమె సినిమాకుచాలా ప్లస్ అయింది. కాకపోతే ఈ సినిమా ట్రీట్మెంట్ నెమ్మదిగా సాగడం, సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీయడం, ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. మొత్తం మీద ఈ సినిమా విభిన్న చిత్రాలని కోరుకునే ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

నటీనటుల పనితీరు
సుధీర్ బాబు గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్‌తో ఫ్రెష్‌గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్‌తో తన టైమింగ్‌‌తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంటర్వెల్ సీన్స్‌లో కూడా చాలా బాగా చేశాడు. తెలుగులో తొలిసారి కథానాయకిగా నటించిన నాభ నటేష్ కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో గ్లామర్‌తో బాగానే ఆకట్టుకుంది. సినిమాలో ఇంపార్టంట్ రోల్‌లో కనిపించిన నాభ మంచి ప్రతిభను కనబర్చింది. ఆమె తదుపరి చిత్రాల్లో కూడా మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటే, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. తండ్రి పాత్రలో నటించిన నాజర్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పిస్తారు. ఇక సినిమాలోని మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు రాసుకున్న కథను అందంగా స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపొతే ఆయన కథనంపై ముఖ్యంగా రెండువ భాగంపై ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. కామెడీ ట్రాక్ కూడా చక్కగా నడిపించారు. సినిమాలో సినిమాటోగ్రఫీ హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు. లోకనాథ్ అందించిన పాటల్లో కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్‌లోని సాగతీత సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని సుధీర్ బాబు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

బలాలు
* నటీనటులు
* సినిమాటోగ్రఫీ
* సెంటిమెంట్ సీన్స్

బలహీనతలు
* సెకెంఢాప్
* ఊహకందే సన్నివేశాలు

మొత్తంగా: నన్నుదోచుకుందువటే.. ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది.

రేటింగ్: 2.75/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.