మా జోలికొస్తే ఊరుకోనంటూ బాలయ్యకు నాగబాబు వార్నింగ్

దాదాపు నెల రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన మెగా-నందమూరి వివాదానికి తెరపడింది. ‘నందమూరి బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, ప్రముఖ నటుడు నాగబాబు తెరలేపిన ఈ వివాదానికి ఆయనే పుల్‌స్టాప్ పెట్టేశారు. తన కుటుంబంపై, సోదరులు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై గతంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా నాగబాబు కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో బాలయ్యపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఇది ఆయన దృష్టికి వెళ్లడంతో అసలు బాలయ్యపై ఎందుకు కామెంట్లు చేయాల్సి వచ్చిందనే దానికి వివరణలు ఇచ్చుకున్నారు. ‘‘గతంలో బాలకృష్ణ గారు మా కుటుంబంపై ఐదు, ఆరు సార్లు దారుణమైన కామెంట్లు చేశారు. వాటిని అందరికీ చూపించి, ఒక్కొక్కదానికి నా వివరణ ఇస్తాను’’ అని చెప్పి వరుసగా ఐదు వీడియోలను విడుదల చేశారు. ఇక, చివరి దానికి కొంత సమయం తీసుకుని గురువారం మరోసారి సోషల్ మీడియాకెక్కారు. ఈ వీడియోలో వివాదాన్ని ఈ వీడియోతో ముగిస్తున్నానంటూ చెబుతూనే నందమూరి బాలకృష్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

చివరి వీడియోలో.. ‘‘2012లో జరిగిందిది. అప్పుడు నాకు సోషల్ మీడియా అందుబాటులో లేదు. కేవలం మెసేజ్‌లు మాత్రమే చేసే పరిస్థితి ఉంది. అప్పుడు ఏదో ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘చిరంజీవి.. మా నాన్నగారి కాలి గోటికి కూడా సరిపోడు’ అని కామెంట్ చేశాడు. ఇది చూసిన వెంటనే మా అందరికీ దారుణమైన కోపం వచ్చింది. అయితే, మేము సంస్కారం ఉన్న వాళ్లం అందుకే ఆయనలా కామెంట్ చేయలేకపోయాం. కానీ, అన్నయ్య మాత్రం బాలయ్య చిన్న పిల్లాడు అని మాత్రమే అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కనిపించలేదు. అందుకే మీకు దానిని చూపించలేకపోతున్నాను. కావాలంటే ఓ ప్రముఖ పేపర్‌లో ప్రచురణ అయింది. దాన్ని వెతుక్కోవచ్చు’’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే దీనికి కౌంటర్‌గా ‘‘ఎన్టీఆర్ గారు గొప్ప నటుడైతే కావొచ్చు. ఆయన మీకు గొప్ప.. మాకు మా అన్నయ్యే గొప్ప. ఆయన మాకు అన్నయ్యే కాదు.. తండ్రి లాంటి వారు. మా మధ్య అప్పుడప్పుడు వివాదాలు వచ్చినా కలిసిపోయే అన్నదమ్ములం.. కొట్టుకునే అన్నదమ్ములం కాదు. నేను ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేస్తున్నా. బాలకృష్ణ గారు మళ్లీ ఏదైనా కామెంట్లు చేస్తే మా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఆయనే కాదు.. మా కుటుంబంపై ఎవరు కామెంట్ చేసినా ఇలాగే స్పందిస్తా. కల్యాణ్ బాబును విమర్శించాలనుకుంటే ఎన్నైనా అనుకోండి.. అది కూడా రాజకీయపరంగానే. మళ్లీ వ్యక్తిగత దూసణకు దిగితే బాగోదు. ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను’’ అంటూ బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే నాగబాబు ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నారేంటి..? అని ప్రశ్నిస్తున్న వారందరికీ సమాధానం చెప్పారు. అది ఈ వీడియోలో చూడొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.