నా నువ్వే మూవీ రివ్యూ

తారాగ‌ణం: న‌ంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల‌కిశోర్, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, సురేఖా వాణి త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్‌ప్లే: జ‌యేంద్ర శుభ‌
నిర్మాత‌లు: కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి
ద‌ర్శ‌క‌త్వం: జ‌యేంద్ర‌

నంద‌మూరి మూడోత‌రం న‌ట‌వార‌సుల్లో ఒక‌రైన క‌ల్యాణ్ రామ్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు అవుతోంది. కెరీర్ ప్రారంభంలో వ‌చ్చిన ‘అత‌నొక్క‌డే’, ఇటీవ‌ల వ‌చ్చిన ‘ప‌టాస్‌’ వంటి హిట్స్ త‌ర్వాత కల్యాణ్‌రామ్‌కు ఒక్క హిట్ కూడా దక్కలేదు. పాత్ర‌ల ప‌రంగా ఏదో ఒక కొత్త‌ద‌నాన్ని చేయాల‌నుకునే క‌ల్యాణ్ రామ్.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ నుంచి యూ ట‌ర్న్ తీసుకుని పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైన‌ర్ సినిమాను చేశారు. అదే నేడు విడుదలైన ‘నా నువ్వే’. యాక్షన్ సినిమాలు చేసే కల్యాణ్‌రామ్ ఇలాంటి స‌మ‌యంలో రొమాంటిక్ మూవీ ఎందుకు చేశాడు? అస‌లు క‌ల్యాణ్ రామ్ రొమాంటిక్ సినిమాల‌కు సూట్ అవుతాడా? తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:
మీరా(త‌మ‌న్నా) రేడియో జాకీ. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా 36 గంట‌ల రేడియో మార‌థాన్ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేస్తుంది. అందులో త‌న ప్రేమ క‌థ‌ను చెప్ప‌డంతో సినిమా స్టార్ట్ అవుతుంది. వ‌రుణ్‌(క‌ల్యాణ్‌రామ్‌) చదువుపూర్తి చేసి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. అత‌ని స్నేహితులు(వెన్నెల‌ కిశోర్‌, ప్ర‌వీణ్‌) కూడా అత‌నితోనే ఉంటారు. అయితే ఎయిర్‌పోర్టు చేరుకున్న ప్ర‌తిసారి వ‌రుణ్‌ ఏదో ఒక కార‌ణంతో ఫ్లైట్ మిస్ చేసుకుంటూ ఉంటాడు. వ‌రుణ్ బామ్మ క‌ల్యాణి త‌న‌కు పెళ్లి చేయాల‌ని ల‌వ్ సైన్ పుస్త‌కం కొంటుంది. ఓ సంద‌ర్భంలో దాన్ని వ‌రుణ్ చ‌ద‌వ‌డానికని తీసుకుంటాడు. ఆ పుస్త‌కాన్ని ట్రెయిన్‌లోనే మ‌ర‌చిపోతాడు. అది అనుకోకుండా మీరాకి దొరుకుతుంది. మీరా కూడా ఆ పుస్తకాన్ని ఇంకెవ‌రికో ఇచ్చేసినా కూడా అది మీరా ద‌గ్గ‌రికే మ‌ళ్లీ చేరుకుంటుంది. అస‌లే విధిని బ‌లంగా న‌మ్మే మీరా.. త‌న‌కు, ఆ పుస్త‌కంతో ఏదో రిలేష‌న్ ఉంద‌ని న‌మ్ముతుంది. ఆ పుస్త‌కం ఓపెన్ చేయ‌గానే అందులో వరుణ్ ఫోటోను చూస్తుంది. వ‌రుణ్‌ని చూడ‌గానే త‌ను అప్ప‌టి వ‌ర‌కు పాస్ కానీ ఎగ్జామ్స్ పాస్ అయిపోవ‌డం స‌హా కొన్ని ప‌నులు జ‌రిగిపోతాయి. దాంతో వ‌రుణ్‌ను త‌న ల‌క్కీ అని మీరా బ‌లంగా న‌మ్మి అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. సిటీలో అత‌న్ని చూసిన ప్ర‌తిసారి క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. వ‌రుణ్ కూడా మిస్ అవుతుంటాడు. ఓసంద‌ర్భంలో వ‌రుణ్‌ని క‌లుసుకుని త‌న‌కు జ‌రిగిన అనుభ‌వాలు చెప్పి ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తుంది. అయితే వ‌రుణ్‌.. మీరాకు ఓ ప‌రీక్ష పెడ‌తాడు. ఆ ప‌రీక్ష ఏంటి? మీరా అందులో నెగ్గుతుందా? ఇద్ద‌రు క‌లుసుకుంటారా? అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌:
ప్రేమ‌, విధి అనే రెండు అంశాల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర రాసుకున్న క‌థ‌. ఇందులో ప్రేమికగా న‌టించిన త‌మ‌న్నా… డెస్టినీ న‌మ్మి ప్రేమికుడు క‌ల్యాణ్ రామ్ వెంట‌ప‌డుతుంది. డెస్టినీని న‌మ్మ‌ని క‌ల్యాణ్ ఆమె ప్రేమ‌కు పెట్టే ప‌రీక్షే సినిమా. క‌థ గురించి చెప్పాలంటే ఇంత‌కంటే ఏం లేదు. ప్రేమ‌క‌థ‌లు ఒకేలా ఉన్నా.. ప్రెజెంటేష‌న్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అందువ‌ల్ల‌నే సగం ప్రేమ‌క‌థ‌లు విజ‌య‌వంతం అవుతుంటాయి. అలాగే ప్రేమ క‌థల విష‌యానికి వ‌స్తే సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ కీల‌క భూమిక‌లు పోషిస్తాయి. ఈ సినిమాలో ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా సంగీతం లేదనే చెప్పాలి. పాటలు విజువల్‌గా బాగున్నా వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నట్టు అనిపిస్తుంది. కెమెరామెన్ పనితనం బాగుంది. ప్రతి సీన్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. ప్ర‌తి విజువ‌ల్ బ్యూటీఫుల్‌గా అనిపిస్తుంది. ప్రేమిక సాంగ్‌… హె ఐల‌యు సాంగ్స్ మాత్రం ఫర్వాలేదనిపించాయి.

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమాలో చాలా అందంగా క‌నిపించింది. క‌ల్యాణ్‌రామ్ మేకోవ‌ర్ కూడా బావుంది. కానీ.. క‌ల్యాణ్‌రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. కొన్ని స‌న్నివేశాల్లో అయితే త‌మ‌న్నా ఎక్స్‌ప్రెష‌న్స్ సీన్‌కు నప్పలేదు. కామెడీ కూడా పెద్ద‌గా వ‌ర్కవుట్ కాలేదు. వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్ మధ్య వచ్చే సన్నివేశాల్లో కామెడీ పండలేదు. కామెడీ యాంకర్ బిత్తిరి సత్తి కొంత ఫర్వాలేదనిపించాడు. పాత్ర‌ల మ‌ధ్య ప్రేమ‌క‌థ‌ల్లోని ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేక‌పోవ‌డంతో సినిమా మెయిన్ పాయింట్‌ను సాగ‌దీసిన భావ‌న క‌లుగుతుంది. మొత్తంగా డైరెక్ట‌ర్ జ‌యేంద్ర సినిమాను గ్రిప్పింగ్‌గా హ్యాండిల్ చేయ‌డంలో ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి.

చివరిగా: డెస్టినీ బేస్‌గా తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ప్రేమ కథల్లో డెస్టినీని చొప్పించి తీసిన సినిమాల్లో సగం సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. చిత్రీకరణ పరంగా నూతనత్వం ఉన్నా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏమీ లేదు. డెస్టినీ పేరుతో ఒకసారి కలుసుకున్న ప్రేమికులను మళ్లీ విడదీసి మళ్లీ కలపాలనుకోవడం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. కథ ఇంకొంచెం గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది.

రేటింగ్: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.