టీడీపీ ఎంపీ మురళీమోహన్ సంచలన నిర్ణయం

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా ఉన్న ఆయన.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపి.. కొద్దిరోజుల్లో కీలక ప్రకటన చేయబోతున్నారట. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమహేంద్రవరంలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారిందట. ఇంతకీ మురళీమోహన్ ఏ నిర్ణయం తీసుకున్నారు..? చంద్రబాబుతో దేని గురించి చర్చించనున్నారు…?

పదేళ్లుగా రాజమహేంద్రవరంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంపీ మురళీమోహన్. టీడీపీ అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ఆయన చంద్రబాబు వెంటే ఉన్నారు.. ఆయన చెప్పిందే చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు పలు రకాలుగా సహాయపడ్డారు. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లో మురళీమోహన్‌ గెలిచారు. అయితే ఆయన గెలిచాక మాత్రం ఆయనపై నియోజకవర్గ ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. తమను సరిగా పట్టించుకోవట్లేదనే ఓటర్లు భావించేవారు.

ఆ సమయంలోనే మురళీమోహన్ కోడలు రంగంలోకి దిగారు. తన మామపై వస్తున్న అపవాదును పోగొట్టడానికి రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడే మకాం వేశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ప్రజలతో రూపాదేవి కలిసిపోయారు. ప్రజల సమస్యలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. వాటిని ఎప్పటికప్పుడు ఎంపీ మురళీమోహన్ దృష్టికీ, అధికారుల దృష్టికీ తీసుకువెళుతున్నారు. ఎంపీ దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ రూపాదేవి పర్యటిస్తున్నారు. అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఇలా తనదైన వ్యవహారశైలితో ఎంపీ కోడలు రూపాదేవి అందరినీ ఆకర్షించారు. ఈ తరుణంలోనే ఎంపీ వారసురాలిగా రూపాదేవి రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

వీటన్నింటిని గమనించిన మురళీమోహన్ తన రాజకీయ జీవితానికి గుడ్‌బై చెప్పాలని అనుకుంటున్నారట. తన వారసురాలిగా కోడలు మాగంటి రూపాదేవిని ప్రకటించాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని పార్టీ అధినేతతో చర్చించి త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. కష్ట కాలంలో ఉన్న సమయంలో తన వెంటే నడిచిన మురళీమోహన్‌ నిర్ణయాన్ని చంద్రబాబు గౌరవిస్తారో లేదో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.