దానం బాట‌లో ముఖేష్‌… దారి చూప‌నున్న అస‌దుద్దీన్‌

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్‌‌ను వీడతార‌నే చ‌ర్చ ఊపందుకుంటోంది.  మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేప‌ధ్యంలో ఆ పార్టీకి గట్టి దెబ్బే త‌గిలింది. ఇప్పుడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా పార్టీ వీడి గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతుండటంతో పీసీసీ నేతల్లో కలవరం మొదలైంది. అయితే దానం విషయంలో జరిగిన జాప్యం ముఖేష్ గౌడ్ విష‌యంలో జరగకుండా పీసీసీ చీఫ్ ఉత్తమ్ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్‌లో సమావేశమై దీనిపై చ‌ర్చించార‌ట‌.

 

ఈ నేపధ్యంలో పార్టీ లో తమకు దక్కుతున్న గౌరవంపై విక్రమ్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీపీసీసీ ముఖేష్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్న‌ప్ప‌టికీ అత‌ను అధికార టీఆర్ఎస్ వైపు అడుగులు వేయొచ్చనే ప్రచారం ముమ్మ‌రంగా జ‌రుగుతోంది. అయితే ముఖేష్ రాజకీయ భవిష్యత్ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీనే డిసైడ్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ కార్యదర్శులతో పీసీసీ నేతల సమావేశంలో ఏఐసీసీ పెద్దలను కాంగ్రెస్ నేతలు ముఖేష్ గౌడ్, విక్రమ్ గౌడ్‌లు కలిశారు. తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌లోనే ఉంటామని వారు స్పష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది.  కాగా ముఖేష్‌ గోషామహల్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్‌ హయాంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌ నుంచి పోటీ చేసిన ముఖేష్‌గౌడ్‌ 47 వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి ముఖేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.