సంక్రాంతి సినిమా కోళ్లు ఇవేనా…

       సంక్రాంతి వచ్చిందంటే చాలు. సంబరాలు మొదలవుతాయి. ఊరు వాడా అంతా తమ సొంతూరికి చేరుకుంటారు. సందడిగా పండుగ చేసుకుంటున్నారు. సరదాగా గడుపుతారు. ఆట పాటలతో అలరిస్తారు. పనిలో పనిగా కోడి పందేలు వేయడం, బెట్టింగ్ లు పెట్టడం సాధారణమే. అదే సమయంలో వినోదం కోసం సినిమాలు చూడటం కొత్తేం కాదు. పోయినేడు నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల కాగా..అవి హిట్ అయ్యాయి. ఈ సారి పోటీకి సై అంటున్నాయి పందెం కోళ్లు. అవి ఏవి వస్తున్నాయి ఏంటనేది చూద్దాం…
అజ్ఞాతవాసి…
        మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘అజ్ఞాతవాసి’. కొడకా కోటేశ్వరరావు అంటూ వచ్చిన పాటలు అందరినీ అలరిస్తున్నాయి.  పాటలు రిలీజ్ అయిన రోజే మిలియన్లలో వ్యూయర్‌షిప్‌ని సొంత చేసుకుంది. వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్ అని ఇంతకు ముందు వచ్చిన చిత్రాలు రుజువు చేశాయి. ఒకటి జల్సా అయితే, మరొకటి అత్తారింటికి దారేది. ఈ రెండు బాగా ఆడాయి. టాలీవుడ్ రికార్డుల్ని బద్దలు చేశాయి. వారిద్దరి కాంబినేషన్లో వచ్చే చిత్ర మంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ మూవీని అమెరికాలోను అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈనెల పదిన విడుదల కానుంది ‘అజ్ఞాతవాసి’.
జై సింహా…
         సంక్రాంతికి వస్తున్న మరో ప్రముఖ చిత్రం ‘జై సింహ’. బాలయ్య అంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే బాలయ్య అన్నంతగా ఉంటోంది. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటాడు. నందమూరి అందగాడి సినిమా సంక్రాంతికి విడుదలయ్యిందీ అంటే సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. జై సింహ చిత్రంలో బాలకృష్ణ  డైలాగులు, నయన తార స్టెప్పులు కనువిందు చేస్తాయట. సంక్రాంతికి అని చెప్పారు తప్ప తేదిని ప్రకటించలేదు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. నయనతార, హరిప్రియ, నటాషాదోషి కథానాయికలు. నయనతార ఆడియో  పంక్షన్ కు హాజరు కాకపోయినా మిగతా ఇద్దరు అందాల భామలు విచ్చేసి కనుల విందు చేసిన సంగతి తెలిసిందే. చిరంతన్‌ భట్‌ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పండుగ ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.  
రంగుల రాట్నం…
          హీరో రాజ్ తరుణ్, చిత్రా శుక్లా కాంబినేషన్‌లో వస్తుంది రంగుల రాట్నం. అన్నపూర్ణ సంస్థ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సినిమాకు శ్రీరంజని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంపైనా ఆశలు బాగానే ఉన్నాయి. సంక్రాంతి అని చెప్పారుగానీ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు చిత్ర యూనిట్. రాజ్ తరుణ్ ఈ మూవీ తన భవిష్యత్ కు బాగానే బాటలు వేస్తుందని నమ్ముతున్నాడు. 
అరవ కోడి…గ్యాంగ్
          తెలుగు పుంజులే కాదు..అడ్డంగా పోటీకి అరవ పుంజు వచ్చి చేరుతోంది. సూర్య నటించిన గ్యాంగ్ చిత్రం. అందాల తార కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రం బాలీవుడ్ ‘స్పెషల్ ఛబ్బీస్‌’కి రీమేక్. సూర్యకి తెలుగులో మార్కెట్ బాగానే ఉంది. ఆ ఆశతోనే ఈ నెల 12న విడుదల చేస్తున్నారు. సంక్రాంతి సినిమా మార్కెట్ రూ.200 కోట్లని దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఏది హిట్ మరేది పట్ తెలుసుకోవాలంటే పండుగ వరకు ఆగాల్సిందే. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.