టీడీపీని ఓడించేందుకు మోత్కుపల్లి చేసిన ప్లాన్ ఇదే

టీడీపీ నుంచి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతున్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత పోరాటం ప్రారంభించారు. తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై తరచూ ఏదో కామెంట్ చేస్తూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించడం కంటే ముందు చంద్రబాబును ఓడించే అంశాలపైనే ఆయన దృష్టి సారిస్తున్నారు. అందుకోసమే గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డితో భేటీ కూడా అయ్యారు. వీరితో మాత్రమే కాకుండా ఏపీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో మోత్కుపల్లి రహస్యంగా చర్చలు జరిపారని తెలుస్తోంది. ఆయన ఎన్ని చర్చలు జరిపినా, ఎవరితో జరిపినా చంద్రబాబును ఓడించేందుకే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల మోత్కుపల్లి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వాలనుకున్నారు. ఇందుకోసం జనసేన కార్యాలయానికి కూడా వెళ్లారు. అయితే, ఆఖరు నిమిషంలో వీరి భేటీ రద్దయింది. దీనికి కారణాలు తెలియకున్నా.. పవన్‌తో ఎందుకు భేటీ అవ్వాలనుకున్నారు అనే అంశం గురించి సంచలన విషయాలు బయటికొస్తున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్య ఒప్పందం జరిగిందని, అందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోరని, వీరిద్దరి వెనుక బీజేపీ ఉందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఈ కారణంగానో లేక మరో కారణమో తెలియదుగానీ, జగన్.. పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనసేనాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలు కావడంతో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ ఏవో విమర్శలు చేసుకోవడం చేస్తున్నారు. ఈ కారణంగా ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరాన్ని పోగొట్టి, సఖ్యతగా ఉండేందుకు మోత్కుపల్లి ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకోసమే పవన్‌తో భేటీ అవ్వాలనుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి ఉంటేనే తాను అనుకున్న చంద్రబాబు ఓటమి సాధ్యపడుతుందనుకున్న మోత్కుపల్లి ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, జనసేన తెలంగాణ బాధ్యతలను కూడా అడగాలని నిర్ణయించుకున్నారని, దీనితో పాటు ఎస్సీ రిజర్వేషన్లపై పవన్ స్టాండ్ ఏమిటో తెలుసుకోవాలని మోత్కుపల్లి ప్రయత్నించాడని సమాచారం. అయితే, పవన్ షాక్ ఇవ్వడంతో భేటీ జరగలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.