మోత్కుపల్లికి గుండెపోటు.. హైదరాబాద్ తరలింపు

కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్న టీడీపీ బహీష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గుండెపోటు వచ్చింది. గతంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నుంచి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) తరపున పోటీ చేస్తున్న ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ప్రథమ చికిత్సను చేసిన వైద్యుల సూచన మేరకు మోత్కుపల్లిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలోనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఎన్నిక జరుగుతున్న రోజే మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకుని వారందరూ హైదరాబాద్ చేరుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగి, కొద్దిరోజుల కిందట బహిష్కరణకు గురయ్యారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. తనను కావాలనే దూరం పెడుతున్నారని టీడీపీ నేతలపై, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి టీడీపీపై ఆయన పోరాటాన్ని ప్రారంభించారు. ఈ దశలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దగ్గరయ్యారు. దీంతో ఆయనకు జనసేన తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంత్రులతో భేటీ కూడా అయ్యారు. అప్పుడైతే ఆయన టీఆర్ఎస్‌లో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ, ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. తర్వాత ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఈ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. అనంతరం బీఎల్‌ఎఫ్ ఆయనకు మద్దతిస్తామని ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.