కేసీఆర్ నిర్ణయంతో మోత్కుపల్లి సంచలన ప్రకటన

కొద్దిరోజుల క్రితం తెలంగాణలో రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నిలిచారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ పార్టీకి దూరమైన తర్వాత ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్ చేశారు. ఏపీలో చంద్రబాబును ఓడించడమే తన లక్ష్యమని ప్రకటించారు. అందుకోసం తిరుమల వెళ్లి మరీ శ్రీవారికి మొక్కుకున్నారు. ఈ పరిణామాల తర్వాత ఆయనతో పలువురు ఏపీ నేతలు భేటీ అవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అయితే, ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయనను పట్టించుకునేవారే కరువైపోయారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారయన. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వెంటనే మోత్కుపల్లి కూడా కీలక ప్రకటన చేశారు. ఇది చూసిన వారంతా ఆయనపై జోకులు పేల్చుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోత్కుపల్లి.. టీఆర్ఎస్ పార్టీలో చేరుతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని మోత్కుపల్లి ప్రకటించారు. కొద్దిరోజుల్లో అనుచరులతో భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు.

నర్సింహులు పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మోత్కుపల్లి చేరిక దాదాపు ఖాయమైపోయినట్లే అనుకున్నారంతా. కానీ, నిన్న ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో మోత్కుపల్లి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్న ఆలేరును సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగడి సునీతకు అప్పగించారు. దీంతో కేసీఆర్.. మోత్కుపల్లిని లైట్ తీసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు, మోత్కుపల్లిని తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆ మధ్య ప్రయత్నాలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఆలేరు నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, అనుచరవర్గం భారీగా ఉండటం, వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు నిర్దేశించే స్థాయిలో ఓటుబ్యాంకు ఉండటంతో మోత్కుపల్లి తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రయత్నిస్తోందని తెలిసింది. ఇందుకోసం కాంగ్రెస్‌ పార్టీ కొందరు నేతలు మోత్కుపల్లితో మంతనాలు జరిపినట్లు వినికిడి. అయితే ఈ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారట. టీఆర్ఎస్‌లో చేరితే తనకు గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉన్నదని, అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడంలేదని మోత్కుపల్లి సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఇప్పుడు కేసీఆర్ కూడా హ్యాండ్ ఇవడంతో అందివచ్చిన అవకాశాన్ని కాదనుకున్నందుకు మోత్కుపల్లికి తగిన శాస్తి జరిగిందని కొందరు అనుకుంటున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.