నిజంగా మోదీ-షా జోడీకి ఇక నిద్రలేని రాత్రులే

జాతీయ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో జాతీయ స్థాయి పార్టీలు రంగంలోకి దిగాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టు సాధించేందుకు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని వెనక్కునెట్టి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్‌పీ సుప్రీం మాయావతి ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్‌పీ కూటమిగా ఏర్పడినట్టు శనివారంనాడు ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో అఖిలేష్, మాయావతి అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలు అధినేతలు తమ కార్యకర్తలకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రకటన చేశారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు వారు తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు.

దేశంలోని రెండు ముఖ్యమైన పార్టీలు తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయ జనతా పార్టీకి కష్టాలు మొదలయ్యాయనే చెప్పాలి. ఒకవైపు తమ పార్టీపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకత.. మరోవైపు ఫ్రంటుల గోలతో బీజేపీకి కొత్త టెన్షన్స్ ఎక్కువయ్యాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లోనూ పెను మార్పులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు వేరే వేరుగా ఫ్రంటులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగిస్తుండడంతో ఆ ప్రభావం జాతీయ పార్టీలపైనా పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీయేతర కూటమి ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే జట్టు కట్టారు. అలాగే పలు పార్టీలకు చెందిన నేతలతోనూ భేటీ అయ్యారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం.. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ-బీఎస్పీ కలయికతో మోదీ-షా జోడీకి ఇక నిద్రలేని రాత్రులే అని చెప్పవచ్చు.

1 Comment

  1. బీజేపీ పేరుతో మోడీ, అమిత్ షా జోడి,ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ వారిని సమర్థించే కొన్ని ఆంధ్రా అవినీతి పార్టీలు ప్రజాస్వామ్యం పేరుతో రాజ్యాంగ వ్యవస్థల్ని తమ గుప్పెట్లో ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న విషనాగులు.పాము పడగ నీడన విశ్రమించడం ప్రజాస్వామ్యనికి ఎంత ప్రమాదకరమో ప్రజలు గ్రహించాలి. ప్రజాస్వామ్య ముసుగులో తమ లాభం కోసం రాజ్యాంగ వ్యవస్తల్ని నాశనం చేయాలనుకుంటున్న ఈ వంచక విషనాగుల కోరలు పీకి మనమందరం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.