చంద్రబాబును ఇరికించాలనుకుంటే మోదీ బుక్ అవుతాడట

అటు టీడీపీలోనూ.. ఇటు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఎయిర్‌ ఏసియా కుంభకోణం. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని ఆంగ్ల దినపత్రిక బిజినెస్ టుడేలో వచ్చిన ఓ వార్త కలకలం రేపింది. అందులో మలేసియాకు చెందిన ఎయిర్ ఏసియా సీఈవో టోనీ ఫెర్నాండేజ్, ఆ సంస్థ ఇండియా సీఈవో మిట్టూ శాండిల్యాల మధ్య సంభాషణ గురించి ఆ పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. వారిద్దరి సంభాషణలో చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు వచ్చిందని, అక్రమంగా లైసెన్సులు పొందడానికి ఆయనను కలిస్తే సరిపోతుందని వారు చర్చించుకున్నారని ఆ పత్రిక ప్రచురించింది. దీంతో ఈ స్కామ్ వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

విమాన సర్వీసులకు ఐదేళ్ల అనుభవం, కనీసం 20 విమానాలు ఉంటేనే అంతర్జాతీయ సర్వీసులకు అనుమతి ఇస్తారు. ఎయిర్ ఏసియాకు ఈ అర్హతలు లేకపోయినా చట్ట విరుద్ధంగా అనుమతి కోసం ప్రయత్నించింది. అయితే రెండేళ్ల క్రితం ఈ అర్హతలను కుదించారు. ఐదేళ్ల అనుభవం అనే అంశాన్ని పక్కన పెట్టి 20 విమానాలు ఉంటే చాలు అనే నిబంధన పెట్టారు. దీంతో ఎయిర్ ఏసియాకు అంతర్జాతీయ సర్వీసులకు అనుమతి వచ్చింది. అక్కడ వరకు బాగానే ఉన్నా.. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ మిస్త్రీ దీనిపై ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో దాదాపు రూ. 22 కోట్లు చేతులు మారినట్లు చెప్పడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ కేసును మొదట ఈడీకి, తర్వాత సీబీఐకి అప్పగించింది.

అయితే ఈ వ్యవహారం జరిగిన సమయంలో టీడీపీ ఎంపీ అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన మంత్రిగా ఉండడం.. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉండడంతోనే వాళ్ల సంభాషణలో చంద్రబాబు పేరే వచ్చిందనేది సుస్పష్టం. మరో విషయం ఏమిటంటే.. ఎయిర్ ఏసియాకు అనుమతి ఇచ్చేందుకు అశోక్ సంతకం పెట్టుంటే.. దానిని పెట్టుంటే అది కచ్చితంగా పీఎంవోకు తెలుస్తోంది. ఒక కేంద్ర మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని బాధ్యత ప్రధానంగా దేశ ప్రధానిపైనే ఉంటుంది. మంత్రి తీసుకున్న నిర్ణయంలో తప్పులుంటే ప్రధాన మంత్రి పెండింగ్‌లో పెట్టొచ్చు.. లేదా క్యాన్సిల్ చేయవచ్చు. అలా జరగలేదు కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవల్సి ఉంటుంది.

అందుకే ఈ వ్యవహారంలో చంద్రబాబును అనే ముందు.. పీఎంవో కార్యాలయ అధికారులపైనా.. పీఎం నరేంద్రమోదీ పైనా ఆరోపణలు చేయాలి. కేవలం ఆడియో టేపులో పేరే ఉంటేనే ఇంత రాద్దాంతం చేస్తే.. నిబంధనను మార్చిన ప్రభుత్వంపై, దానికి బాధ్యత వహించాల్సిన ప్రధానిపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ కేసును కేంద్ర ప్రభుత్వం త్వరగా ముగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.