మోదీ.. చ‌తుర్ముఖ వ్యూహం ఏమిటో తెలుసా!

న‌రేంద్ర‌మోదీ.. నిన్న‌టి వ‌ర‌కూ అభిన‌వ చాణ‌క్యుడు.. ప్ర‌స్తుతం అందరూ విమ‌ర్శిస్తున్న మోస‌గాడు. కానీ.. ఓ విష‌యంలో న‌రేంద్ర‌మోదీను గ్రేట్ అనాల్సిందే. ఎందుకంటే.. రాజ‌కీయ వ్యూహంలో శత్రువులు.. మిత్రులు ఉండ‌రు. కేవ‌లం నిచ్చెన‌గా ఉప‌యోగ‌ప‌డే వారు మాత్ర‌మే ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే  ఇదో వైకుంఠ‌పాళి. ఇక్క‌డ ల‌క్‌.. టైమింగ్ చాలా ముఖ్యం. కుర్చీ అందుకునేందుకు వ‌చ్చే స‌మ‌యంలో పామునోట ప‌డినా అట్ట‌డుగుకు రావాల్సిందే. అటువంటిది రాజ‌కీయ పాళి ఇంకెంత‌గా ఆడాలి. ఆ ఆట తెలిసిన నేత కావ‌టం వ‌ల్లనే మోదీ పీఎం కాగ‌లిగారు. నోట్ల‌ర‌ద్దు, జీఎస్‌టీ వంటి వాటితో జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నా.. ఇప్ప‌టికీ 57శాతం మంది మ‌ళ్లీ మోదీ కావాలంటున్నారంటే ఆయ‌న చ‌రిష్మా అర్ధం చేసుకోవాలి. ఏపీకు హోదా ఇవ్వ‌లేదుకాబ‌ట్టి.. మ‌నం ఆయ‌న్ను వైరిగా భావిస్తున్నాం. అంత‌మాత్రాన‌.. ఏపీ క‌ష్టాలు.. భార‌త‌దేశ ప్ర‌జ‌లంతా ప‌డుతున్న ఇబ్బందులుగా భావిస్తారా! క‌ర్ణాట‌క‌లో గ‌తంతో పోల్చితే ఓట్ల‌శాతం పెరిగింది బీజేపీకే. పైగా కాంగ్రెస్ గెలుపు కేవ‌లం మోదీ వ్య‌తిరేక‌త‌కంటే.. య‌డ్డీపై ఉన్న అప‌న‌మ్మ‌కం. మొన్న‌టి ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ బాగా దెబ్బ‌తిన్న‌మాట వాస్త‌వ‌మే. అంత‌మాత్రాన క‌మ‌లం కుంగిపోలేదు. ఇప్ప‌టికీ విద్యావంతులైన భార‌తీయ ఓట‌ర్లు.. మోదీ నాయ‌క‌త్వాన్నే కోరుకుంటున్నారు. ఈ మాత్రం అవ‌కాశం ఉంటే.. మోదీ ఊరుకుంటాడా! అందుకే.. ఇప్పుడాయ‌న నాలుగు వ్యూహాల‌కు ప‌ద‌నుపెడుతున్న‌ట్లు సంకేతాలు అందుతున్నాయి. ఒక‌టి.. వైరి వ‌ర్గాల మ‌ధ్య వారిలో వారికే అంత‌ర్గ‌త క‌ల‌హాలు సృష్టించ‌టం. త‌ద్వారా.. కూట‌మి క‌ట్టేముందే విబేధాలున్నాయ‌నే విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌టం. ఇక రెండోది.. బీజేపీ సీనియ‌ర్లు అద్వానీ, జోషి వంటి వారిని మ‌ళ్లీ ర‌థంపైకి ఎక్కించ‌టం.. బావోద్వేగాల‌ను  సొమ్ము చేసుకోవ‌టం. త‌ద్వారా హిందుత్వ ఓటుబ్యాంకును గుండ‌గుత్తుగా దండుకోవ‌టం. మూడో ఎత్తు.. పాకిస్తాన్‌తో  త‌క్కువ కాలం యుద్ధం చేయ‌టం. దీనిద్వారా దేశ‌భ‌క్తి అనే అంశాన్ని భార‌తీయుల న‌రాల్లోకి జొప్పించి.. పాక్‌కు బుద్దిచెప్పిన నేత‌గా కీర్తిని అందుకోవ‌టం. ఇక నాల్గోది.. కూట‌మి త‌యారైతే.. దానిలోకి త‌న మ‌ద్ద‌తునిచ్చే కోవ‌ర్టు నేత‌ల‌ను రంగంలోకి దింపి.. చివ‌రి నిమిషంలోకూట‌మిని బ‌ద్ద‌లు చేయ‌టం.. ఇవ‌న్నీ వైరి ప‌క్షాల‌కు.. త‌ప్పుగా అనిపించినా.. ఇది  రాజ‌కీయం.. ఇక్క‌డ కేవ‌లం గెల‌వ‌టం.. ఓడ‌టం మాత్ర‌మే ఉంటాయి. ఆట‌లో మాత్ర‌మే నిబంధ‌న‌లుంటాయి.. రాజ‌కీయ క్రీడ‌లో నిబంధ‌న‌లు.. అప్ప‌టి అవ‌కాశాలు.. అవ‌స‌రాన్ని బ‌ట్టి మారుతుంటాయి. ఎందుకంటే.. రాజ‌కీయ‌నేత‌లు.. అక్క‌డ రిఫ‌రీలు.. క్రీడాకారులు కాబ‌ట్టి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.