హైద‌రాబాద్‌లో  ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎమ్మెల్సీలు…

ముందస్తు ఎన్నికలకు సై అంటూ సీఎం కేసీఆర్ సంకేతాలు ఇవ్వడంతో అధికార పక్షమైన టీఆర్ఎస్‌లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. ఓవైపు సిట్టింగ్‌లు తమకే టిక్కెట్ గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ కొట్టేసిన నేతలు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళూరుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. సీఎం కేసీఆర్ సైతం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ విసిరిన సవాల్‌తో ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. టీఆర్ఎస్ శ్రేణులయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సై అంటున్నాయి. ఇక అదే సమయంలో అధికారపార్టీలో టిక్కెట్ల లొల్లి కూడా మొదలైంది. ఆశావహులు టిక్కెట్ల కోసం వేట ప్రారంభించారు. వివిధ మార్గాల ద్వారా పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య టీఆర్‌ఎస్‌లో భారీగా పెరిగింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట వివిధ పార్టీల నుంచి గులాబీకండువా కప్పుకున్న నేతలే కాకుండా.. గత ఎన్నికల్లో టిక్కెట్ రాని నేతలు కూడా ఆశావహులుగా ఉన్నారు.
గతంలో టిక్కెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్న నేతలు కూడా టిక్కెట్‌ పోటీలో నిలుస్తూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలు ఒకే నియోజకవర్గంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు వర్గాలుగా విడిపోయి పనిచేసుకుంటున్నారు. ఎన్నికలనాటికి  సమసిపోతాయని భావించిన వర్గ విభేదాలు ఈ పరిణామం వల్ల శ్రుతిమించడం గమనార్హం! ఇప్పటినుంచే వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో ప‌ట్టు నిలుపుకునేందుకు అటు ఎమ్మెల్యేలు, ఇటు ఎమ్మెల్సీలు ప్రయ‌త్నిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల‌ కోసం వారికి వ‌చ్చే నిధుల‌ను ఖ‌ర్చుచేస్తున్నారు. ఇన్ని రోజులు అసంతృప్తిగా ఉన్న అనుచ‌రుల‌ను మ‌ళ్లీ ద‌గ్గరికి తీస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్సీలు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌లియ‌తిర‌గ‌డం.. మీటింగ్‌లు పెట్టడం.. వారి నిధులను ఖర్చుచేయడం వంటి అంశాలను ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఎమ్మెల్సీలు త‌మ సీటుకు ఎక్కడ ఎస‌రుపెడ‌తారో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఓవైపు సిట్టింగ్‌లకే సీట్లని కేసీఆర్ ప్రకటించగా.. ఎమ్మెల్సీలు మాత్రం టిక్కెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గాల్లో తిరగడాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ రూరల్‌లో వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కీ, ఎమ్మెల్సీ భూపతిరెడ్డికీ మధ్య వైరం ముదిరింది. వాస్తవానికి బాజిరెడ్డి ఎన్నికల ముందు వైసీసీ నుంచి టీఆర్ఎస్‌లోకి జెంప్ చేశారు. ముందునుంచి నియోజకవర్గంలో భూపతిరెడ్డి పట్టు సాధించారు.
అయితే ఆయనకు దక్కాల్సిన టిక్కెట్ బాజిరెడ్డి ఎగరేసుకుపోయారు. ఈ తరుణంలో భూపతిరెడ్డి అసంతృప్తికి గురికాకుండా ఎమ్మెల్సీతో గౌరవించింది పార్టీ అధిష్టానం. అయినా నిజామాబాద్ రూరల్‌లో ఇద్దరి మధ్య గ్రూప్ రాజకీయం పతాకస్థాయికి చేరింది. జిల్లా నేతలంతా భూపతిరెడ్డిపై పార్టీ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది పరిస్థితి. అయినప్పటికీ భూపతిరెడ్డి మాత్రం నియోజకవర్గంలో తన పట్టుకోసం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఏదిఏమైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీచేస్తానని తన అనుచరులకు చెబుతున్నారు. దాదాపుగా టీఆర్ఎస్ నుంచి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం కూడా ఆయన వెతుకుతున్నారట.మునుగోడు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో కర్నె ప్రభాకర్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశాన్ని పొందారు. కేసీఆర్‌కు సన్నిహిత అనుచరుడని ఆయకు పేరుంది. ఎమ్మెల్సీ అవకాశం పొందినా.. ప్రత్యక్ష రాజకీయాలపైనే ఆయన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యేకు పోటీగా నియోజకవర్గంలో చాపకింద నీరులా పనిచేసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోనూ అధికారపార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం అక్కడ భూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడా స్థానంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ కన్నేశారు. నియోజకవర్గంలో క్యాడర్‌ను పెంచుకుంటూ ముందుకెళుతున్నారు. తన నిధులను అదే నియోజకవర్గంలో ఖర్చుచేస్తున్నారు. దీంతో నియోజవర్గంలో అధికారపార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. భూపాలపల్లి జిల్లా పరకాల నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ ఆవుతోంది. చల్లా ధర్మారెడ్డి వర్సెస్ కొండా మురళి అన్నట్లుగా అక్కడ రాజకీయం రగులుతోంది. చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కొండా మురళి ఇక్కడినుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల కథనం.
కల్వకుర్తినియోజకవర్గంలో అధికారపార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే లేనప్పటికీ.. ఇక్కడ నేతల మధ్య టిక్కెట్ల లొల్లి ఎక్కువగానే ఉంది. కల్వకుర్తి నుంచి పోటీచేసి ఓడిపోయిన జైపాల్ యాదవ్ మళ్లీ టిక్కెట్‌ ఆశిస్తుండగా.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీచేయాలని ఉవ్విళూరుతున్నారు. దీనికితోడు ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎడ్మ కృష్టారెడ్డి కూడ టిక్కెట్ ఆశిస్తుండటంతో కల్వకుర్తి అధికారపార్టీలో టిక్కెట్ ఎవరికి వస్తుందోననే అయోమయంలో క్యాడర్ చిక్కుకుందట.గ్రేటర్ హైదరాబాద్‌లోని  కుత్బుల్లాపూర్ నియోజకవర్గానిది మరో కథ! టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు శంభీపూర్ రాజు. రెండు మూడుసార్లు ఆయనకి టిక్కెట్‌ అందినట్టే అంది చేజారిపోయింది. కేసీఆర్‌, కేటీఆర్ హరీశ్‌రావు, కవితల ఆశీస్సులు దండిగా ఉన్న రాజుకు గత ఎన్నికల్లో కూడా నిరాశే ఎదురైంది. చివరి నిముషంలో కొలన్ హన్మంతరెడ్డి టిక్కెట్ అందుకుని పోటీచేసినా ఓటమి పాలయ్యారు. అప్పట్లో తనకు టిక్కెట్ ఇచ్చి ఉంటే గులాబీ జెండా ఎగురవేసే వాడినని పార్టీ పెద్దల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు. శంభీపూర్ రాజు లాయల్టీని గౌరవించి ఆయనను ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్‌. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కించుకుని పోటీచేయాలని భావిస్తున్న ఆయకు ఆపరేషన్ ఆకర్ష్‌ కారణంగా మళ్లీ నిరాశే మిగులుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వివేకానంద్ గౌడ్ టీఆర్ఎస్‌లో చేరారు. అయితే పార్టీ పెద్దలు వివేక్‌తో కలుపుకుపోవాలని శంభీపూర్ రాజుకు సూచించడంతో అన్ని విషయాల్లో సహకరిస్తూ.. నియోజకవర్గంపై పట్టు సడలనివ్వకుండా పనిచేసుకుపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి టిక్కెట్ట తనదేననీ, ఎమ్మెల్యేగా పోటీచేయడం ఖాయమనీ కార్యకర్తలకు చెబుతున్నారు. నియోజవర్గంపైనే దృష్టిసారించిన శంభీపూర్ రాజు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ పరిణామం స్థానిక ఎమ్మెల్యే వివేక్‌కి చెమటలు పట్టిస్తోంది. పైకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సన్నిహితంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం ఎవరికి వారు టిక్కెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో నియోజకవర్గం రాజేంద్రనగర్‌లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు చెక్ పెట్టేందుకు శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పావులు కదుపుతున్నారు. తన సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉండటంతో వచ్చే ఎన్నికల్లో అక్కడినుంచి పోటీచేయాలని ఆయన భావిస్తున్నారు. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ పరిణామం ప్రకాష్‌గౌడ్‌కు రుచించడం లేదు. ఇలా పలు నియోజకవర్గాల్లో అటు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల మధ్య పెరుగుతున్న అంతరం అధికారపార్టీ ముఖ్య నేతలకు ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ సమస్యకు గులాబీబాస్ ఎలాంటి పరిష్కారం అన్వేషిస్తారో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.