కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ముగిసినా హడావిడి మాత్రం తగ్గడంలేదు. ఈ ఎన్నికలు అయిన నెల రోజులకే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో పాటు, కొద్దిరోజుల్లో లోక్‌సభ సమరం కూడా ఉండడంతో అన్ని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అయితే 16 ఎంపీ స్థానాలను గెలవాలనే పట్టుదలతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసేసింది. అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. మరోవైపు, ముందస్తు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనే ఆలోచనలో ఉంది. అందుకోసం, గత ఎన్నికల్లో జరిగిన తప్పులకు తావులేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఉండాలా..? వద్దా..? అనే విషయంపై టీ కాంగ్రెస్ నేతలు స్థానిక నాయకల అభిప్రాయాలను సైతం సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హాట్ టాపిక్‌గా మారారు.

ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని ఎంతో మంది సీనియర్లు ఓడిపోయారు. ఆ పార్టీలోని ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పుకున్న జానారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్ కుమార్‌, కొండా సురేఖ, సర్వే సత్యనారాయణ సహా పలువురు ఓటమి పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ గెలిచి తన సత్తాను నిరూపించుకున్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఈ మధ్య తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇటీవల కేసీఆర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. తాను ఇక మీదట ముఖ్యమంత్రిని విమర్శించనని చెప్పారు. ఇక, తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ పొత్తు ఉండాల్సిందేనని అధిష్ఠానం దగ్గర పట్టుబట్టారు. అలాగే తన భార్య నిర్మలకు మెదక్‌ ఎంపీ టికెట్‌ ఇస్తే గెలిపించుకుంటానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తనకు సీఎల్పీ నేతగా అవకాశం ఇవ్వాలని ఉత్తమ్‌ను కోరినట్లు చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో గెలిచినందుకు జగ్గారెడ్డి అధిష్ఠానం దగ్గర తన డిమాండ్లను వినిపిస్తుండడం చూసి పార్టీలోని పలువురు నేతలు షాక్ అవుతున్నారట. ఈయన విషయంలో మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.