చిన్నదే అయినా చురుకెక్కువ!

దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరం చిన్నదే అయినప్పటికీ రాజకీయపరంగా చురుగ్గా వ్యవహరిస్తుందనే పేరుమోసింది. ఇక్కడున్న అన్నిరాజకీయ పార్టీలు కొత్తకొత్త ఎత్తుగడలతో ప్రత్యర్థి పార్టీలకు దడపుట్టిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మిజోరం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 10 లక్షలుకాగా, అసెంబ్లీ సీట్లు 40 ఉన్నాయి. ఇక్కడ ఈ నెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. మిజోరంలో క్రైస్తవ ఓటర్లశాతం అత్యధికంగా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో కనీసం ఒక్క సీటులోనైనా దక్కించుకోవాలని బీజేపీ శత విధాలా ప్రయత్నిస్తున్నదని కాగా మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య హోరాహోరీ పోరు జరగనుందని తెలుస్తోంది. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక శక్తి అని ఈ రెండు పార్టీలు ఎద్దేవా చేస్తూ బీజేపీ ఎత్తుగడలను తిప్పికొడుతున్నాయి. అయినా వెనక్కు తగ్గక బీజేపీ అభివృద్ధి, సంక్షేమం అనే అజెండాతో ముందుకు వెళుతున్నదని సమాచారం. కాగా మిజోరం రాష్ట్రం మియాన్మార్, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాపించి ఉంది.

కాగా రాబోయే క్రిస్మస్ పండగను బీజేపీ ప్రభుత్వం మిజోరంలో ఘనంగా నిర్వహించనుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఇలీవల ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు మిజోరంలో కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించాలని బీజేపీ తనకు అందుబాటులో ఉన్న అన్ని ప్రయత్నాలను సాగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలైన అసోం మణిపూర్, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటికే తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. కాగా మిజోరంలో కాంగ్రెస్ 2008 నుంచి అధికారంలో కొనసాగుతోంది. దీంతో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 34, ఎంఎన్‌ఎఫ్‌కు 5, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు ఒక సీటు దక్కింది. అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 32 సీట్లు వచ్చాయి. కాగా మేఘాలయ, నాగాలాండ్‌లలో కూడా క్రైస్తవుల సంఖ్య అధికమే. దీంతో బీజేపీ ఇక్కడ ఇతర పార్టీలతో జతకట్టి మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా మిజోరంలో 39 సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది. కాగా బీజేపీతో స్థానిక ప్రాతీయపార్టీ ఎంఎన్‌ఎఫ్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దీనికితోడు కాంగ్రెస్ ఇటీవలే బీజేపీ మతతత్వ వైఖరిని ఎండగడుతూ 50 వేల కరపత్రాలు పంపిణీ చేసింది. మరోవైపు చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్‌తో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఎంఎన్‌ఎఫ్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపద్యంలో రాబోయే ఎన్నికల్లో మిజోరంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.