మహానాడు పరువు తీసిన మంత్రి

మ‌హానాడు. ఆపేరు చెబితేనే అన్న ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. అంతగా మహానాడును నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారు. టీడీపీకి పండుగ. అలాంటి పండుగను పేలవంగా నిర్వహించి మంత్రి జవహర్ తన చేతగానితనాన్ని చాటుకున్నాడు. ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు కూడ మ‌హానాడును ఇంత పేలవంగా నిర్వహించలేదు టీడీపీ. టీడీపీ మ‌హానాడు ఎప్పుడూ గ్రాండ్ స‌క్సెస్ అవుతుంది. ఆ పార్టీకి ఉన్న కార్య‌క‌ర్త‌ల బ‌లం ఎంతో ఈ సభలోనే తెలుస్తోంది. మ‌హానాడుకు ముందుగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాల్లో మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. చివరిగా మహానాడు జరుగుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ, పార్టీ ఇన్‌చార్జ్‌లు ఆ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కడప లాంటి చోట వేలాది మంది మహానాడుకు తరలివస్తున్నారు. 
వచ్చింది 392 మంది
కానీ ఎక్సైజ్ మంత్రి కె.జ‌వ‌హ‌ర్ ప్రాతినిద్యం వ‌హిస్తోన్న కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గ మినీ మ‌హానాడు టీడీపీ పరువు తీసింది. ఈ మ‌హానాడు ఎంత ఘోరంగా జ‌రిగింది అంటే కచ్చితంగా 392 మంది మాత్రమే ఈ సభకు హాజరయ్యారు. లెక్కపెట్టి మరీ టీడీపీ నేత ఒకరు ఈ సంగతి చెప్పారు. ఇది ప్ర‌తి ఒక్క టీడీపీ కార్య‌క‌ర్త‌ను తీవ్ర‌ మనోవేద‌కు గురి చేసింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన మ‌హానాడు కార్య‌క్ర‌మాలు అన్నీ అద్భుతంగా జరిగాయి. ఉంగుటూరు మ‌హానాడుకు వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చారు. అక్కడే కాదు… పాల‌కొల్లు, దెందులూరు, గోపాల‌పురం, చింత‌ల‌పూడి, న‌ర‌సాపురం, నిడ‌ద‌వోలు, త‌ణుకు వంటి చోట్ల 10 వేల నుంచి 5 వేల మందికి పైగా కార్యకర్తలు తరిలి వచ్చారు. 
ఓ చిన్న హాలులో ఈ కార్య‌క్రమం పెట్టి మంత్రిగారు తన పరువు తీసుకున్నాడంటున్నారు అక్కడి జనాలు. సరిగా ప్రచారం చేయలేదు. జన సమీకరణ చేయలేదు. కార్యకర్తలను ఆహ్వానించలేదు. కనీసం ప్లెక్సీలు వేయలేదు. ఏదో మొక్కుబడిగా కార్యక్రమం ఉంటే వస్తాను అన్నట్లుగా సాగింది మంత్రి వ్యవహార శైలి. కుర్చీలు చాలా వరకు ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. వేసింది ఐదు వందల కుర్చీలే. అయినా నిండలేదు. 
మ‌హానాడు కార్య‌క్ర‌మం మొదలయ్యాక జనం వస్తారనుకున్నారు. అయినా అసలు రాలేదు. ఫలితంగా కొవ్వూరు మ‌హానాడు అట్టర్ ప్లాప్ అయింది. మ‌హానాడు విలువను జ‌వ‌హ‌ర్ తీసేసిన‌ట్ల‌య్యింద‌ని అక్క‌డ‌కు వ‌చ్చిన కొద్దిపాటి కార్య‌క‌ర్త‌లు వాపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క నేత‌, గ‌త ఎన్నిక‌ల్లో జ‌వ‌హ‌ర్‌కు టిక్కెట్ ఇప్పించ‌డంలో కీల‌కంగా ఉన్న వ్యక్తి పెండ్యాల అచ్చిబాబు. ఆయన వర్గం కావాలనే మ‌హానాడుకు దూరంగా ఉంది. వాస్తవంగా ఆయనకు ఆహ్వానం లేద‌ు. ఆయ‌న రాక‌పోవ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని మిగతా నేతలు లైట్ తీసుకున్నారంటున్నారు.  
వైరి వర్గానికి పిలుపు లేదు..
బీరు ఆరోగ్యానికి మంచిదని ఎక్సైజ్ మంత్రిగా చెప్పిన జవహర్ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏం చేసినా ఏదో ఒక రికార్డు ఉంటోంది. టీడీపీలో ఉంటూ మందు తాగండని చెబుతున్న ఆయన తీరును సీనియర్లు అంతా తప్పు పట్టారు. బికామ్ లో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ కూడ మందు తాగమని చెబుతారా అంటూ సెటైర్లు వేశారు. అలాంటిది ఇప్పుడు జవహర్ తీరులో మార్పు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. పార్టీ కోసం ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డిన వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు జవహర్. ఈ సంగతి అక్కడి కార్యకర్తలే చెబుతున్నారు. కొన్ని చోట్ల ప్లెక్సీలు వేసినా చంద్రబాబు, లోకేష్ ఫొటోలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా టీడీపీ క్యాడర్ అటువైపు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గానికి పార్టీ ప‌రిశీల‌కులుగా ఎంపీ రాయ‌పాటి త‌న‌యుడు రంగారావు వచ్చి అసహనంతో వెళ్లి పోయారు. మినీ మ‌హానాడుకు విచ్చేసిన ఆయ‌న స్టేజ్ ఎక్క‌గానే అక్క‌డ జ‌నాలు లేని సంగతి గమనించి.. ఎందుకు అని ఆరా తీశారు. ఆ తర్వాత స్టేజ్ నుంచి కింద‌కు దిగిపోయారు. కొవ్వూరులో పార్టీ ప‌రువు బ‌జారున పడటంతో అసలు ఏం జరిగిందనే విషయంపై టీడీపీ ఆరా తీస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.