మేక‌పాటి పై ఆస‌క్తి క‌ర‌మైన చ‌ర్చ‌

మేకపాటి రాజమోహన్‌రెడ్డి! వైకాపా ఎంపీ. అయిదుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవజ్ఞులు. గత తొమ్మిదేళ్లుగా నెల్లూరు ఎంపీగా ఉంటున్నప్పటికీ ఈ ప్రాంత సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తిన సందర్భాలు చాలా తక్కువ. అంతెందుకు.. నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించిన ఘటనలు కూడా తక్కువ. బిట్రగుంటలో రైల్వే పరిశ్రమ ఏర్పాటుచేయాలని ప్రజలు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నారు. అయినా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. మునుపు జరిగిన ఉపఎన్నికల్లో మూడు లక్షలకి పైగా మెజారిటీ సాధించుకున్న మేకపాటికి గత ఎన్నికల్లో కేవలం పదమూడు వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఈ అంశాన్ని కొందరు పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మేకపాటి నెల్లూరు నుంచి పోటీచేయకపోవచ్చుననీ, నరసరావుపేటకి షిఫ్ట్‌ కావచ్చుననీ అంచనా వేస్తున్నారు. ఎంపీ మేకపాటి తీరుపై ప్రజలు పెదవి విరవడానికి కారణాలున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు తమ స్వస్థలానికి చేరువనే ఉన్న కంపసముద్రం, సీతారామపురం మండలంలోని మారంరెడ్డిపల్లె గ్రామాలని ఆయన దత్తత తీసుకున్నారు. మేకపాటి వాటిని దత్తత అయితే తీసుకున్నారు కానీ.. ఆ తర్వాత ఆ ఊసే మరచిపోయారు. కంపసముద్రంలో అన్ని గ్రామాల్లో మాదిరిగానే రోడ్లు వేశారు. మేకపాటి ప్రత్యేకంగా శ్రద్ధపెట్టి చేసిందేమీ లేదు. మారంరెడ్డిపల్లె గ్రామాన్ని దత్తత తీసుకునే సందర్భంలోనే మేకపాటి ఇక్కడికి వచ్చారు. మళ్లీ ఆ ఊరి ముఖమే చూడలేదు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో మేకపాటి తమ గ్రామాలని దత్తత తీసుకోవడంతో స్థానికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అవి నెరవేరపోవడంతో ఇప్పుడు గట్టిగానే దుయ్యబడుతున్నారు.

 

“మరీ ఎందుకయ్యా! మేకపాటిని అంతలా విమర్శిస్తున్నారు?” అని ఎవరైనా అడిగితే.. ఆ రెండు దత్తత గ్రామాల ప్రజలు అనేక విషయాలు వల్లిస్తున్నారట. “క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌నే తీసుకోండి. గూడూరు మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగని దత్తత తీసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయల నిధులతో ఎన్నో పనులు చేపట్టారు. ప్రతి నెలా సచిన్‌ ఆ గ్రామంలో పనులపై ఆరా తీస్తారట. ఇంకా ఏమేమి చేయాలో తెలుసుకుంటారట. గ్రామంలో ఇంటింటికీ కుళాయి, కంపోస్ట్‌ యార్డ్‌, కమ్యూనిటీ హాలు, క్రికెట్‌ గ్రౌండ్‌, సిమెంట్‌ రోడ్లు, అంగన్‌వాడీ భవనం, చెరువులో చేపల పెంపకం.. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆ గ్రామానికి పక్కనే ఉన్న నెర్నూరుని కూడా దత్తత తీసుకుని అక్కడా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అదండీ దత్తత విషయంలో చిత్తశుద్ధి చూపడం అంటే..” అని ప్రజలు గడగడా వల్లిస్తున్నారట. 

 

ఎంపీమేకపాటి తీరుపై వైసీపీ క్యాడర్‌ సైతం అసంతృప్తిగా ఉండటం గమనార్హం. ఆయన ఆ రెండు గ్రామాలను దత్తత తీసుకోకపోయినా బాగుండేది. తీసుకున్నాక శ్రద్ధ చూపించకపోవడం సబబు కాదు. ఒక పక్క సచిన్‌ టెండూల్కర్‌, మరోవక్క అశోక్‌బాబు తాము దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధి పట్ల శ్రద్ధ చూపుతున్నారు. మేకపాటి మాత్రం ఆ గ్రామాల సంగతే పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ప్రజలు విమర్శిస్తున్నారని వైకాపా నేతలు అంటున్నారు. కనీసం ఏదైనా ఒక ప్రధాన సమస్యని తీసుకుని.. దాన్ని పరిష్కరించి ఉంటే ప్రజలు చిరకాలం గుర్తుంచుకునేవారు అని వారు చెబుతున్నారు. ఏదిఏమైనా తాను దత్తత తీసుకున్న గ్రామాల విషయంలో మేకపాటి వారి వ్యవహారశైలి మాత్రం విమర్శనాత్మకంగానే ఉంది. చూద్దాం… వచ్చే రోజుల్లో అయినా ఆయన ఆ గ్రామాలకు ఏమైనా చేస్తారో లేదో..! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.