బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి మాజీ మంత్రి పేరు…

నాలుగేళ్ల తర్వాత ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త ముఖాన్ని ఎంపికచేయాలనే ఆలోచన ప్రారంభమైంది. ఈ పదవి కోసం అనేకమంది పోటీపడుతున్నా చివరకు సంఘ్ నేపథ్యం ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆ పార్టీ పెద్దలు నిర్ణయించారు. బీజేపీ తీసుకునే నిర్ణయాలపై ఆర్.ఎస్.ఎస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ మధ్య నిన్నటివరకు కొనసాగిన పొత్తు పెటాకులైంది. 2019 ఎన్నికలకి బీజేపీ ఒంటరిగానే వెళుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున రాష్ట్ర బీజేపీకి సమర్ధుడైన, వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తిని సారథిగా నియమించాలని నిర్ణయించారు. ఇందుకోసం కులాల వడపోతలో భాగంగా కాపులకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటివరకు ఏపీ బీజేపీకి అధ్యక్షుడుగా కంభంపాటి హరిబాబు వ్యవహరించారు. విశాఖ ఎంపీగా ఉన్న ఆయనను ఆ పదవికే పరిమితం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ తరుణంలో కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. సోము వీర్రాజుకు సంఘ్ నేపథ్యం ఉన్నప్పటికీ దూకుడు స్వభావం ఎక్కువ. బీజేపీ, టీడీపీ మధ్య రాష్ట్రంలో పొత్తు కొనసాగిన కాలంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై సోము వీర్రాజు పలుమార్లు వ్యక్తిగతంగా నోరు పారేసుకున్నారు. రెండెకరాల రైతు రెండువేల కోట్లు ఎలా సంపాదించారంటూ బాబుపై ఆయన చేసిన విమర్శలు అప్పట్లో బీజేపీ హైకమాండ్ వరకు వెళ్లాయి. కన్నా లక్ష్మీనారాయణకు సంఘ్‌లో కొంతమంది పెద్దల అండదండలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం మంచిది కాదనీ, పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్లను నిర్లక్ష్యం చేసినట్టవుతుందనీ కొందరు నేతలు హైకమాండ్‌కు నివేదించారు. అంతకుముందు కన్నా పేరు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పరిశీలనలోకి వచ్చింది.
తాజాగా పశ్చిమ గోదావరిజిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు పేరు పరిశీలనలోకి వచ్చింది. సంఘ్ నేపథ్యం ఉండటం, ఆర్.ఎస్.ఎస్ నేతలు కూడా ఆమోదముద్ర వేయడం ఆయనకు ప్లస్‌ పాయింట్లు. దీనికి తోడు వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా పేరు ఉండటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పైడికొండల పేరును పార్టీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది. అంతకుముందు ఆయన బీజేపీ, టీడీపీ పొత్తుపై మాట్లాడుతూ “కొండకు వెంట్రుక కట్టాము. వస్తే కొండ వస్తుంది, రాకపోతే వెంట్రుక పోతుంది. అవతల వారికి మాత్రం బోడిగుండే..” అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీజేపీలో కూడా కలకలం రేపాయి. మొన్నటివరకూ ఏపీలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావుకు సంఘ్ నేపథ్యం పుష్కలంగా ఉంది. అందువలనే ఆయన పేరును రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం దాదాపుగా ఖరారు చేస్తారని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే హరిబాబుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి తెలుగుదేశం మంత్రులు ఇద్దరు రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అందువల్లనే హరిబాబుకు పదవి లభించే ఛాన్సు ఉందని బీజేపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇటు మాణిక్యాలరావు నియామకం కూడా అతి త్వరలోనే జరగవచ్చునని అంటున్నారు. చూద్దాం వచ్చే రోజుల్లో ఎవరికి అందలాలు లభిస్తాయో!

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.