హరికృష్ణ చివరి కోరిక తీర్చిన మంచు మనోజ్

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబానికి, మంచు మోహన్‌బాబు కుటుంబానికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా ఈ సంబంధం కొనసాగుతూనే ఉంది. అటు సినిమాల్లోనూ.. ఇటు నిజ జీవితంలోనూ వీరి బంధం బలంగానే ఉంది. గతంలో మోహన్‌బాబు నటించిన ‘శ్రీరాములయ్య’ సినిమాలో నందమూరి హరికృష్ణ నటించగా, మంచు మనోజ్ నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ సినిమాలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రను పోషించారు. అంతేకాదు, వీరి తర్వాతి తరం కూడా ఇంతే స్నేహంగా ఉంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్‌కు మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వీరిద్దరూ కలిసిమెలసి ఉంటూ ఇప్పటికీ తరచూ కలుస్తూ ఉంటారు. అన్నట్లు వీరిద్దరూ ఒకే తేదీన పుట్టారు. అలాగే ఇద్దరి భార్యల పేర్లు ఒకటే. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ వీరిద్దరినీ నిజమైన అన్నాదమ్ముల్లా చూస్తుంటారు.

తాజాగా నందమూరి హరికృష్ణ మరణంతో ఈ కుటుంబాల మధ్య బంధం మరోసారి బయటపడింది. హరికృష్ణ అన్నా.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ అన్నా ఎంతగానో ఇష్టపడే మంచు మనోజ్.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. గురువారం ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందించాడు. హరికృష్ణ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశాడు. అయితే అదే సమయంలో మీడియాకు మనోజ్ ఓ అభ్యర్థన చేశాడు. హరికృష్ణ గారి మరణానికి సంబంధించిన రోడ్డు ప్రమాద దృశ్యాలను ప్రసారం చేయవద్దని కోరాడు. అలా ప్రసారం చేయడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు మరింత కుంగిపోతున్నారని మంచు మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని.. తన వినతిని మన్నిస్తారని ఆశిస్తున్నానని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇక శుక్రవారం మరోసారి మంచు మనోజ్ నందమూరి అభిమానుల మనసు దోచుకున్నాడు. హరికృష్ణ చనిపోయే ముందు అనుకున్న ఓ పనిని మనోజ్ చేయనున్నట్లు ప్రకటించాడు.

హరికృష్ణ మరణ వార్త తెలిసిన తర్వాత ఆయన రాసిన లేఖ ఒకటి బయటికొచ్చిన విషయం తెలిసిందే. ‘‘సెప్టెంబర్ 2న అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేరళ రాష్ట్రంతో పాటు మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో.. వరదలు, వర్షాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బేనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

హరికృష్ణ లేకపోయినా ఆయన మాటను గుర్తుంచుకున్న మంచు మనోజ్ కేరళ బాధితులకు సాయం చేస్తానని ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘‘ఆయన కోసం.. మనం ముందుకొద్దాం. ఆయన గుర్తుగా నేను 5 లక్షలు కేరళ బాధితులకు సహాయం చేస్తున్నాను. ఇలాగే నందమూరి అభిమానులంతా.. లక్షలాది మంది కేరళ ప్రజల సహాయార్థం ముందుకొచ్చి, హరికృష్ణ కోరిక తీరుస్తారని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నాడు. మంచు మనోజ్ చేసిన పనికి నందమూరి అభిమానులతో పాటు, సినీ ప్రియులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, కష్ట కాలంలో తమ అభిమాన నేత కుటుంబానికి అండగా నిలిచావంటూ కొనయాడుతున్నారు. తాము కూడా సాయం చేస్తామంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.