క్యాలిఫోర్నియా లో అత్యంత ఘనంగా మనబడి స్నాతకోత్సవం

క్యాలిఫోర్నియా : సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవాలు, శుక్రవారం మే 18న  క్యాలిఫోర్నియాలో ఘనంగా ప్రారంభమైనాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తో కలిసి మనబడి నిర్వహించిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన 300 మందికి పైగా విద్యార్ధినీ విద్యారులకు, మిల్పిటాస్ లోని ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్ వీ సత్యనారాయణ చేతులమీదుగా ధృవీకరణ పత్రాల బహూకరణ జరిగింది.  ఈ సందర్భంగా ఆచార్య ఎస్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, వేలమైళ్ల దూరంలో ఉన్నా, మాతృభాషపై మమకారంతో తెలుగు భాష నేర్చుకుంటున్న చిన్నారులను, అందుకు ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులను అభినందించారు. అమెరికా వ్యాప్తంగా 250 కేంద్రాల ద్వారా తెలుగు నేర్పిస్తూ భాషా సేవలో పాల్గొంటున్న మనబడి ఉపాధ్యాయులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, కీలక బృంద సభ్యుల సేవల ద్వారా తెలుగు భాష ముందు తరాలకు చేరువ అవుతోందని, హర్షం వ్యక్తం చేసారు. 

మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, అమెరికా వ్యాప్తంగా సిలికానాంధ్ర మనబడి, తెలుగు విశ్వవిద్యాలయం కలిసి 5 దేశాలలో 58 కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షలలో 1857 మందికి గాను 1830 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులై 98.54% విజయం సాధించారని, అందులో 68.6% డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించగా, 20.4% విద్యార్ధులు మొదటి తరగతి సాధించారని, ఉత్తీర్ణులైన   విద్యార్ధులకు, లాస్ ఏంజిల్స్, డాలస్, చికాగో,అట్లాంటా, వర్జీనియా, న్యూజెర్సీ నగరాలలో జరగబోయే స్నాతకోత్సవాలలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్ వీ సత్యనారాయణ గారి చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు అందజేయబోతున్నామని,ఈ పరీక్షల నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. కొత్త విద్యాసంవత్సరానికి నమోదు కార్యక్రమం మొదలైందని, విద్యార్ధులు manabadi.siliconandhra.org ద్వారా ఆగస్ట్ 30, 2018 లోగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.  సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, కేజీ నుంచి పీజీ దాకా విద్యాబోధనే ధ్యేయంగా ఏర్పాటు చేఅసిన మనబడి, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం తోపాటుగా, భారతదేశంలో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి కార్యాచరణను తెలియజేసారు.

మనబడి స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల నిర్వహించగా, తెలుగు విశ్వవిద్యాలయం అధికారులు ఆచార్య రమేష్ భట్టు, ఆచార్య రెడ్డి శ్యామల, డా. గీతా వాణి, సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, ఉపాధ్యక్షులు దిలీప్ కొండిపర్తి, మనబడి ఉపాధ్యక్షులు శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, మనబడి మరియు మనబడి బృంద సభ్యులు శ్రీరాం కోట్ని,  శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, కృష్ణ జయంతి, సాయి కందుల, లక్ష్మి యనమండ్ర, తదితరులు పాల్గొన్నారు.  

2 Comments

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.