మహానటి మూవీ రివ్యూ

సినిమా పేరు : మహానటి
రేటింగ్ : 3.0/5
జానర్ : బయోపిక్‌
తారాగణం : కీర్తీ సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్‌
దర్శకత్వం : నాగ్‌ అశ్విన్‌
నిర్మాత : అశ్వనీదత్‌, ప్రియాంక దత్‌, స్వప్నాదత్‌
మాటలు: బుర్రా సాయిమాధవ్
ప్రొడక్షన్ డిజైన్: శివం
ఆర్ట్: అవినాష్
కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన
స్టైలిస్ట్: ఇంద్రాక్షి
కెమెరా: డాని
ఆర్ట్: తోట తరణి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు
పరిచయ మాటలు…
 తెలుగు తెర స్వర్ణయుగంలో మహా అధ్యాయం సావిత్రి. ఆమె నటనా వైదుష్యం, భావ వ్యక్తీకరణ తిరుగులేని నటరాణిగా నిలిపాయి. ఇచ్చిన పాత్ర ఇచ్చినట్టు చేసుకుపోవడం ఇప్పటి కథానాయికల శైలి. అప్పట్లోనూ కథానాయికలు ఇలాగే ఉండేవారు. కాని మొండి పాత్రల తలలు వంచి, గెలిచి చూపించిన సాహస నట ఆణిముత్యం సావిత్రి. ‘దేవదాసు’లో పార్వతిగా.. ‘రక్త సంబంధంలో’ చెల్లిగా.. ‘దేవత’లో ఇల్లాలిగా.. ‘పాండవ వనవాసం’లో ద్రౌపదిగా.. ‘నర్తన శాల’లో సైరంధ్రిగా.. ఇలా ఏ చిత్రం తీసుకున్నా ఆమె నటన ‘న భూతో న భవిష్యతి’ అన్న రీతిలో ఉండేది.
పాత్రలో నటించడం కాదు. జీవిస్తారు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తూ.. ప్రేక్షకులు తన్మయం చెందేలా చేశారు సావిత్రి. ఒక్క మాటలో చెప్పాలంటే భాషకు అందని మేటినటి. తనకు లభించిన అన్ని పాత్రల్లోనూ జీవించింది. ఇల్లాలిగా, ప్రేయసిగా, చెల్లిగా, తల్లిగా.. ఇంకా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నట భాండాగారం ఆమె. చక్కని రూపం, స్పష్టమైన వాచకం, ముఖంలో కనిపించే అభినయం ఆమెలోని బలాలు. 
అలాంటి నటి జీవిత చరిత్రతో సినిమా తీయడం అద్భుతం. నటనకు ప్రతిరూపం. అపర దాతృత్వశీలిగా అశ్రితుల పక్షపాతిగా ప్రజల హృదయాల్ని గెలుచుకుంది సావిత్రి. ఎన్నో ఉత్థానపతనాల్ని చవిచూసింది. మహానటి ప్రేక్షక నీరాజనాలందుకున్న ఆమె జీవితాన్ని వెండితెర దృశ్యరూపమే మహానటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం తెలుగు సినీ చరిత్రలో రికార్డులను క్రియేట్ చేస్తోంది ఈ చిత్రానికి అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇలాంటి చిత్ర రాజం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథలోకి వెళితే…
సావిత్రి బాల్యం నుంచి మృతి వరకు ఉన్న ఘట్టాలను ఆవిష్కరిస్తూ తీసిన చిత్రమిది. ఓ సినిమా షూటింగ్ కోసం నిమిత్తం బెంగళూరు వెళ్తుంది సావిత్రి(కీర్తిసురేష్). అక్కడే ఆరోగ్యం బాగోలేక పోవడంతో ఆసుపత్రిలో చేరుస్తారు సావిత్రి ఎవరు, ఎంటనేది ఆసుపత్రి వర్గాలకు తెలియదు. ఫలితంగా ఓ మామూలు వ్యక్తిగానే భావిస్తారు. అప్పుడే ఆమెను వెతుక్కుంటూ లక్షలాది మంది అభిమానులు తరలివస్తారు. ఆ తర్వాత అసలు సంగతి తెలుసుకుంటారు ఆసుపత్రి వాళ్లు. దక్షిణాది చిత్రసీమలో గొప్ప నటిగా పేరుతెచ్చుకున్న సావిత్రి అనే నిజం తెలుసుకుంటారు. అలా కథ మొదలవుతోంది. అప్పుడు ఉన్న ప్రజావాణి పత్రిక తరపున మధురవాణి (సమంత) అనే పాత్రికేయురాలు, ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీ (విజయ్ దేవరకొండ)తో కలిసి సావిత్రి జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా మొదలవుతోంది సావిత్రి జీవిత కథ…
సావిత్రి తండ్రి చనిపోవడంతో పెదనాన్న కె.వి. చౌదరి (రాజేంద్రప్రసాద్) ఆమె బాధ్యతలను తీసుకుంటారు. చిన్నతనంలోనే తన స్నేహితురాలితో కలిసి నాటకాలు వేసేది సావిత్రి. ఆ తర్వాత నాటకాలకు ఆదరణ తగ్గడంతో సినిమాల వైపు ఆసక్తి చూపిస్తోంది. సావిత్రిని సినిమా హీరోయిన్ చేయాలని అనుకుంటాడు ఆమె పెదనాన్న చౌదరి. ఆ తర్వాత మద్రాస్ కు వెళతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అందుకే తన సొంతూరికి వెళ్లిపోతుంది సావిత్రి. కానీ సావిత్రిలోని ప్రతిభను గుర్తించిన జెమిని గణేషన్ కు భవిష్యత్ అర్థమవుతోంది. అందుకే ఆమె పెద్ద నటి అవుతుందని భావిస్తారు. అదే సమయంలో ఏఎన్నాఆర్‌తో కలిసి నటించే అవకాశం సావిత్రికి దక్కుతుంది. కానీ సంభాషణలు సరిగా చెప్పలేకపోవడంతో సావిత్రిని ఆ సినిమా నుంచి తప్పిస్తారు దర్శకుడు ఎల్.వి. ప్రసాద్. ఆ తర్వాత సినిమాల్లో అడుగు పెట్టి అదే దర్శకుడితో శభాష్ అనిపించుకున్న గొప్పనటిగా ఎదుగుతోంది సావిత్రి.  
పరిణయం…
గొప్ప కథానాయికగా ఆమెను తీర్చిదిద్దిన జెమిని గణేషన్‌తోనే ప్రేమలో పడుతుంది సావిత్రి. సమాజం, కుటుంబం కాదన్నా ఆమె ఊరుకోలేదు. అతన్నే మనువాడుతోంది. పెళ్లి తర్వాత సావిత్రి నటించిన సినిమాలన్ని అతి పెద్ద విజయాల్ని సాధిస్తాయి. ఫలితంగా జెమిని గణేషన్ కంటే నటనా వైదుష్యమణి సావిత్రికి ఎక్కువ పేరు వస్తుంది. సావిత్రి విజయాల్ని చూసిన జెమిని గణేష్ ఆమెకు దూరమవుతాడు. ప్రాణంగా ప్రేమించిన భర్త మోసానికి గురవుతోంది. ఆ ప్రభావం మిగతా వారి మీద పడుతోంది. అందరినీ ద్వేషించడం మొదలవుతోంది. అదే మొత్తంగా సావిత్రి జీవితం.  తాను నమ్మిన వ్యక్తులంతా కలిసి ఆమెను మోసం చేయడంతో మద్యానికి బానిసగా మారుతోంది. ఆ తర్వాత ఎలా కన్నుమూసింది. ఆమె జీవితంలో జరిగిన ఘట్టాలతో అల్లిన కథనే సావిత్రి చిత్ర కథ. 
దర్శక ప్రతిభ…
సావిత్రి చేసిన సినిమాలు, పాత్రలే అందరికీ తెలుసు. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. సావిత్రి జీవితంలోని పలు కోణాలను దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా బాగా తెరకెక్కించారు. సాధారణ కుటుంబంలో పుట్టి తన ప్రతిభాపాటవాలతో ప్రేక్షక హృదయ సామ్రాజ్ఞిగా మారిన వైనాన్ని అర్థం చేసుకున్నారు. అలా పాత్రలను రాసుకున్నాడు. సినిమాలకే పనికి రావని చెప్పిన వారితోనే మీరు మా సినిమాలకు పని చేయాలని బతిమిలాడే పరిస్థితికి తీసుకువచ్చారు. సావిత్రిలోని అంకితభావం, పాత్రలకు ప్రాణం పోయడానికి పడిన తపన అజరామరం. ఆమె ఒక మహానటి. మహోజ్వలంగా సాగిన ఆమె సినీ జీవితాన్ని బాగా చూపించారు నాగ్ అశ్విన్. వ్యక్తిగతం జీవితంలో ఆమె పడిన ఇబ్బందులను ఇతరులు ఆమోదించేలా చేయడం మాములు విషయం కాదు. జెమిని గణేషన్‌తో ప్రేమ, పెళ్లి బంధం విచ్చిన్నం కావడానికి దారి తీసిన సంఘటనలు, అప్పటి అనుబంధాలు, ఆప్యాయతలు. ఆ తర్వాత ప్రేమకు దూరమై ఆమె ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను బాగా తీశారు. సినిమాలు, వ్యక్తిగత జీవితం రెండింటికి ఉన్న తేడాను చక్కగా చూపిస్తూ కథను నడిపిన తీరు చాలా బాగుంది.  
నాగ్ అశ్విన్ కథను నడిపిన తీరు ప్రశంసలందుకుంది. సావిత్రి కథను చెప్పకుండా సమంత, విజయ్ దేవరకొండ పాత్రల ద్వారా ఆమె జీవితాన్ని బాగా చెప్పించారు. చాలా అనుభవం ఉన్న వ్యక్తిలా ఈ సినిమాను తెరకెక్కించారు. గత కాలంనాటి సంగతులు, నాటి వైభవం ఉట్టేపడేలా చేశారు. తీసే విధానంలోను మనం ఆ మూడు గంటలు పాతకాలం నాటికి వెళ్లిపోతాం. అంతగా ఆకట్టుకుంటాయి సినిమాలోని దృశ్యాలు. గత వైభవాన్ని గుర్తుకు తెప్పించారు. సావిత్రి బాల్యం, నాటకాలు, సినిమా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు బాగున్నాయి. రెండో భాగంతో కథలోకి మరింతగా లీనమైపోతాం. మాయాబజార్ సీన్, కె.వి.రెడ్డి, ఎల్.వి ప్రసాద్, చక్రపాణి, పుల్లయ్య, ఎస్వీరంగారావులతో సావిత్రికి ఉన్న అనుబంధాన్ని తెలియజెెప్పారు. 1940ల కాలం నాటి మద్రాస్ పట్టణం, విజయ, వాహిణి స్టూడియోలు, ఆప్పటి చిత్రీకరణల తీరు చూస్తే దర్శకుడిని అభినందించకుండా ఉండలేం. 
అభినవ సావిత్రి…
ఇక సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అనేకంటే జీవం పోషిందనే చెప్పాలి. ఆ పాత్రకు కీర్తి బాగా నప్పింది. తన అసమాన అభినయంతో అలనాటి సావిత్రిని గుర్తుకు తెప్పించింది కీర్తిసురేష్. కొన్ని సన్నివేశాల్లో సావిత్రినే ఇలా ఉందా అనిపించింది. నటనతో బాగా ప్రతిభ చూపింది. జెమిని గణేషన్‌గా దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక జెమిని హావభావాలు, శైలి ఆకట్టుకున్నాయి. మన ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య, కె.వి.రెడ్డిగా క్రిష్, ఎల్.వి. ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, చక్రపాణిగా ప్రకాష్‌రాజ్ అతిథులుగానే కనిపిస్తారు. పాత్రలు చిన్నవే కానీ సినిమాకు అదనపు బలమని చెప్పాలి. సమంత తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటన ఈ సినిమాలో కనపడుతోంది. రంగస్థలం ఉత్సాహంలో ఉన్న సమంతకు ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. పతాక ఘట్టాల్లో సావిత్రి, సమంత కన్నీటిని తెప్పిస్తాయి. విజయ్ ఆంటోనీగా విజయ్‌దేవరకొండ పాత్ర ఆకట్టుకుంటోంది. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు, డానీ ఛాయాగ్రహణం సినిమాకు ప్రాణం. అవినాష్ నేతృత్వంలో కళా దర్శకత్వ బృందం పనితీరు ఈ సినిమాలో చాలా బాగా కనపడుతోంది. 
సావిత్రి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చూపించే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ విజయవంతం అయ్యారనే చెప్పాలి. ప్రేమ, కరుణ, రౌద్రం, చిలిపితనం వంటి అనేక రసాలను కీర్తి సురేష్ లో చూపించారు.
ప్లస్ పాయింట్లు…
+ కథ
+ కథనం
+ దర్శకత్వ ప్రతిభ
+ సంగీతం
+ కీర్తి సురేష్, సమంత, దుల్కార్ నటన
+ కళా దర్శకత్వం
మైనస్ పాయింట్లు
– పెద్ద నటులు చిన్న పాత్రలు
– నిదానంగా కథా గమనం
– జీవితంలోని మరికొన్ని పాత్రలు మర్చిపోవడం
చివరిగా…
సావిత్రి జీవితం తెలుసుకోవాలంటే మహానటి చూడాల్సిందే..

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.