కేసీఆర్‌పై మహాకూట‌మి నెగ్గుతుందా!

సేమ్‌.. 2009లో అప్ప‌టి ఉమ్మ‌డిరాష్ట్ర సీఎం వైఎస్‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ఓడించేందుకు అంతా చేతులు క‌లిపారు. అనుకూల‌మీడియా కూడా ఇదో అద్భుత‌మైన ఘ‌ట్టమంటూ వ‌ర్ణించింది. ఇంకేముంది.. హ‌స్తం ప‌ని అయిపోయిన‌ట్లే అంటూ ప‌తాక‌శీర్షిక‌ల‌తో ఊద‌ర‌కొట్టింది. ఇదంతా.. నిజ‌మే బ‌ల‌మే అనుకుని చంక‌లు గుద్దుకున్న కూట‌మి పార్టీలు.. వైఎస్ చేప‌ట్టిన ప్ర‌తి అభివృద్ధి ప‌నిలోనూ లొసుగులు వెతికాయి. విమ‌ర్శ‌లుగా బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌నాల చెవిలో ఊదేశాయి. ఫ‌లితాల‌న్నీ.. కూట‌మికే.. మ‌ళ్లీ సీఎం బాబు.. హోంమంత్రి కేసీఆర్‌.. ఇలా ఏవో లెక్క‌లు వేసుకున్నారు. కానీ.. చివ‌ర్లో.. కూట‌మి ఖంగుతినేలా కాంగ్రెస్ నెగ్గింది. వైఎస్ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మ‌ళ్లీ ప‌దేళ్ల‌కు.. అదే మ‌హాకూట‌మి.. అయితే.. ఇప్పుడు హ‌స్తం స్థానంలో టీఆర్ ఎస్‌. వైఎస్ ప్లేసులో కేసీఆర్ ఉన్నారు. పార్టీలు.. హ‌స్తం అటువెళ్లి.. టీడీపీతో జ‌త‌క‌ట్ట‌బోతుంది. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న మ‌న మాస్టారు.. అదేనండీ కోదండం.. జ‌న‌స‌మితి.. నేనూ మీతోనే అంటూ తొడ‌కొట్టింది. అయితే..చిక్కంతా ఒక్క‌టే. ఎవ‌రి మాట  ఎవ‌రు వినాలి. ఏ పార్టీ కూట‌మి బాధ్య‌త‌ను భుజాన వేసుకుంటుంది.
కాంగ్రెస్ జాతీయ‌పార్టీ కావ‌టంతో ఉత్త‌మ్‌కు ఆ బాధ్య‌త అప్ప‌గించారు. ఆయ‌న కూడా.. అదిష్ఠానం ఏదంటూ.. అదేనంటూ త‌లూపాల్సిందే. లేదంటే.. రేప‌టికి ఉత్త‌మ్‌సీట్లో ఏ కోమ‌టిరెడ్డో.. మ‌రో జానారెడ్డి.. లేక‌పోతే.. గీతారెడ్డో చేరిపోతారు. ఎందుకీ తంటా.. సోనియ‌మ్మ‌పై భార‌మేసి వ‌దిలేశాడు. మ‌రి టీడీపీ.. త‌న‌కోసం కాంగ్రెస్ వ‌చ్చిందంటే.. మేమే బ‌ల‌వంతులం. కాబ‌ట్టి సీట్ల పంపిణీ మా సైకిల్‌కే అంటూ మ‌రో స‌న్నాయి నొక్కులు. కేసీఆర్ అంటే ఎంత వైర‌మో.. చంద్ర‌బాబు అంటే అంతే ఇదిగా ఎగిరిప‌డే మాస్టారు.. మాత్రం.. వీరిద్ద‌రి మాట వింటారాంటారా.. ఇప్ప‌టికే.. ఎవ‌రికైనా.. కేవ‌లం 25 సీట్లు ఇస్తాం.. ఉంటే ఉండొచ్చు. లేక‌పోతే మీ ఇష్టం అనేంత‌గా ఉత్త‌మ్ వ‌చ్చేశాడు. ఈ స‌మ‌యంలోనే టీఆర్ ఎస్ త‌మ‌కు బ‌ల‌మైన శ‌త్రువు అని భావించిన వారి పాతకేసుల జాబితా తిర‌గేస్తుంది.
ఇప్పుటికే న‌లుగురు ఊచ‌లు లెక్క‌పెట్టేందుకు రెడీ అయ్యారు. ఒక‌రు జ‌గ్గారెడ్డి రూపంలో ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అందుకే.. పొత్తులపై ఆచితూచి స్పందిస్తున్నారు. మాస్టారులాంటి వారు.. తెలంగాణ న‌డిపించిన నాకే.. మీరు టిక్కెట్లు లెక్క చూపుతారా అంటూ కోప‌గిస్తార‌నే ఆందోళ‌న కూడా ఉంద‌ట‌. అటు విమ‌ల‌క్క‌.. ఇటు గ‌ద్ద‌ర‌న్న మ‌రో వైపు పెద్దాయ‌న కోదండ‌రాంను క‌లుపుకుని కూట‌మిని కొలిక్కితేవ‌టం అనుకున్నంత తేలిక కాద‌ని.. టీడీపీ, కాంగ్రెస్‌ల‌కు అర్ధ‌మైన‌ట్టుంది. టీడీపీ మాత్రం.. త‌మ‌కు 35 సీట్లు లెక్క‌కోరుతుంది. రేప‌టిరోజు ఎంపీ సీట్లు ఎన్నికావాలంటుందో అనేది కాంగ్రెస్ ఆందోళ‌న‌. సీట్ల స‌ర్దుబాటు ముందుకు జరిగిన త‌రువాత‌నే కూట‌మి సంగ‌తి అంటూ. ప్ర‌తిపార్టీ నిర్ణ‌యానికి వ‌చ్చాయ‌ట‌. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నిక‌ల్లో ఒక‌రిత‌ర‌పున మ‌రొక‌రు ప్ర‌చారం చేస్తారా అనేది మ‌రో సందేహం. నేత‌లు ప్ర‌చారం చేసినా.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఒక పార్టీకి ఓటేస్తున్న సంప్ర‌దాయ ఓట‌ర్లు మ‌న‌సు మార్చుకుంటారా అనేది మ‌రో ఆందోళ‌న వెర‌సి.. ఇప్పుడు.. కూట‌మితో జ‌ట్టుక‌డితే.. ఎవ‌రికి లాభం.. అనేది మాత్రం అన్ని పార్టీల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ట‌.
2009లో ఇలాగే అనుకుని వైఎస్‌ను త‌క్కువ అంచ‌నా వేస్తే జ‌రిగిన ప‌రాభ‌వం గుర్తుకు వ‌స్తుంద‌ట‌. అప్పుడంటే ఒకే రాష్ట్రం కానీ.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ‌. ఒక‌వేళ కూట‌మి అట్ట‌ర్‌ప్లాప్ అయితే.. హ‌స్తం పార్టీకు జాతీయ‌స్థాయిలో దెబ్బ‌ప‌డుతుంది. టీడీపీ కూడా ఏపీలో దీనితాలూకూ షాక్ త‌ట్టుకోవాల్సిందే. అటు జాతీయంగా.. ఇటు రాష్ట్రంలోనూ ఎదుర‌య్యే ఇబ్బందులు బీజేపీ క్యాష్ చేసుకుంటుంది.ఒక‌వేళ కూట‌మి స‌క్సెస్ అయితే.. కాంగ్రెస్‌కు జాతీయ‌స్థాయి ఖ్యాతి.. టీడీపీ ఏపీలో పక్కా గెలుపు.. రేప‌టి రోజు కేంద్రంలో చ‌క్రం తిప్పేందుకు బ‌లం స‌మ‌కూర‌తాయి. మ‌రి.. ఈ ఊగిస‌లాట మ‌ధ్య‌.. సంధి కుదురుతుందా!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.