సిఎం రేసులో లేనంటున్న లోకేష్

మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు చెప్పిన మాట. బొండా ఉమా, బుద్దా వెంకన్న లాంటి వారు 2014 నుంచే ఈ మాట చెబుతున్నారు. కాకపోతే ఎవరూ పట్టించుకునే వారు లేరు. ఇప్పుడు అదే వాదన తెరపైకి వచ్చింది. ఏడు పదుల వయసుకు వచ్చిన చంద్రబాబుకు రాజకీయ విశ్రాంతి ఇస్తే మంచిదనే వాదన ఆ పార్టీలో సాగుతోంది. అందుకే లోకేష్ ను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తారనే చర్చ లేకపోలేదు. పులి కడుపును పులే పుడుతుందని తెలుగు తమ్ముళ్లు చెబుతుండగా..పిల్లి పుట్టిందంటున్నారు వైకాపా నేతలు. అందుకే పప్పు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబులో ఉన్న ఆత్మవిశ్వాసం, తెగువ, వ్యూహ చతురత లోకేష్ కు లేదంటారు. కనీసం ఐదు నిమిషాలు తప్పు లేకుండా మామ ( బాలకృష్ణ), అల్లుళ్లు ( లోకేష్ )లు మాట్లాడలేరనేది అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న చర్చ. కన్నా లక్ష్మీనారాయణ వంటి వారు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపించినా లోకేష్ సరిగా డీల్ చేయలేక పోవడంతోనే ఆయన వెనక్కు తగ్గారంటారు. అంతే కాదు..కీలకమైన ఎత్తుల విషయంలో లోకేష్ మరింత రాటుదేలాల్సిన అవసరముందంటారు. 
నేను సిఎం  రేసులో లేను…
పంచాయితీ రాజ్, ఐటీ శాఖలను సమర్థవంతంగా నిర్వహించడంలో లోకేష్ కు తిరుగులేదు. మిగతా శాఖలకు ఆదర్శంగా నిర్వహిస్తున్నారనే పేరుంది. కానీ రాజకీయ డీల్స్ విషయంలో ఇంకా అనుభవం సంపాదించాలి. వచ్చే ఎన్నికలకు తాను ముఖ్యమంత్రి అభ్యర్దిని కానని మంత్రి లోకేష్ చెప్పేశారు.  గుంటూరు జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ ప్రస్తావన చేశారు. జగన్, పవన్ కల్యాణ్ లు మాట్లాడినట్లు తాను సిఎం అవుతానని చెప్పలేదు లోకేష్. ఇప్పటికీ, ఎప్పటికీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని అన్నారు. వచ్చే ఎన్నికలలో టిడిపి గెలుస్తుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటకలో బిజెపికి ప్రజలు గుణపాఠం చెప్పారు. 2019 లో అసలు సినిమా రాబోతోందని ఆయన అన్నారు. నాలుగేళ్లు చూసిన తర్వాత ఎన్.డి.ఎ. నుంచి బయటకు వచ్చాం. ఇక వారి అవినీతి, అన్యాయాన్ని సహిస్తూ చూస్తు ఊరుకునేది లేదన్నారు లోకేష్. వచ్చే ఎన్నికలలో లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేనట్లేనంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.