జనసేన కార్యాలయానికి క్యూ కడుతున్న నేతలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది. కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయానికి ధీటైన సమాధానం ఇవ్వాలని పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా అన్ని పార్టీలు పొత్తులు.. అభ్యర్ధుల ఎంపిక వంటి పనుల్లో బిజీ బిజీగా ఉన్నాయి. అభ్యర్ధుల ప్రకటనతో బాంబు పేల్చిన టీఆర్ఎస్ బాస్‌కు.. ఆశావాహులు ఒక్కరొక్కరుగా షాక్ ఇస్తున్నారు. ఇన్ని రోజులు తమ అభ్యర్ధిత్వంపై ఆశలు పెట్టుకుని పని చేసిన కొందరు నేతలు.. టికెట్ రాకపోయేసరికి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌లో రాజకీయం వేడుక్కెతోంది. టికెట్లు తమకే ఇవ్వాలంటూ ఆశావహులు.. ఒత్తిళ్ల తీవ్రతను పెంచారు. పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించొద్దంటూ కొందరు విజ్ఞప్తులు చేస్తుండగా.. రెబల్‌గా పోటీ చేస్తామంటూ మరి కొందరు సవాళ్లు విసురుతున్నారు. మరి కొందరైతే గులాబీ బాస్‌తో నేరుగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, కొద్దిరోజుల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందా..? లేదా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడంతో పలు ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి.

కేసీఆర్‌తో ఉన్న సత్సంబంధాలకు తోడు, ముందస్తు ఎన్నికలను అంచనా వేయలేకపోయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణను లైట్ తీసుకున్నారు. అందుకే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా పర్యటించకపోగా, నాయకులను కూడా పెద్దగా చేర్చుకున్నది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలనే అంశం మ్మీద జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్‌)తో ఆదివారం తమ పార్టీ కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆశావహులు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేనను సంప్రదిస్తున్నారని, ఈ మేరకు మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయానికి క్యూ కడుతున్నారని సమాచారం. పార్టీ కార్యాలయానికి వస్తున్నవారిలో చాలా మంది ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో వస్తున్నారని, అయితే.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వాళ్లను మాత్రమే జనసేనలో చేర్చుకుంటామని వారికి పార్టీ నేతలు చెబుతున్నారట. ఈ లెక్కన చూస్తే జనసేన పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.