లగడపాటి సర్వే.. తెలంగాణలో ఇప్పుడిదే హాట్ టాపిక్

అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీతో పాటు మిగిలిన పార్టీలన్నీ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. అయితే, ఊహించని రీతిలో అసెంబ్లీని రద్దు చేసిన రోజే కేసీఆర్.. 105 మంది అభ్యర్ధులను ప్రకటించి సంచలనానికి తెరలేపారు. దీంతో మిగిలిన పార్టీలన్నీ అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నాయి ప్రతిపక్ష పార్టీలు. అందుకోసం టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం-కాంగ్రెస్ పొత్తు తెరపైకి వచ్చింది. తాజాగా ఈ రెండు పార్టీలకు తోడు సీపీఐ, తెలంగాణ జనసమితి కూడా జట్టుగా ఏర్పడబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా పార్టీల అధ్యక్షులు ఇప్పటికే పలుమార్లు సమావేశం కూడా అయ్యారు. శుక్రవారం ఢిల్లీలో జరగనున్న సమావేశంలో కూటమి ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఓ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే హాట్ హాట్‌గా సాగుతున్న తెలంగాణ రాజకీయాలకు మరింత మంట పెడుతోన్న అంశమే లగడపాటి సర్వే.

సర్వేల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించే వాటికి ఓ ప్రత్యేకత ఉంది. చాలా వరకూ లగడపాటి జోస్యం చెప్పారంటే అవి చాలాసార్లు పక్కాగా కరెక్ట్ అని తేలాయి. అందుకే ఆయనను ఆంధ్రా ఆక్టోపస్ అంటారు. గతంలో ఎన్నో ఎన్నికలకు సర్వే చేయించిన ఆయన.. తాజాగా తెలంగాణలో కూడా సర్వే నిర్వహించినట్లు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది. దీనిని రాష్ట్రంలోని పలు పార్టీల నేతలు తమకు అనుకూలంగా చెప్పుకుంటున్నారు. గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారు టీఆర్ఎస్‌ అరవై నుంచి డెబ్బై స్థానాల్లో విజయం సాధిస్తుందని, అలాగే కాంగ్రెస్‌కు ముప్పై నుంచి నలభై స్థానాల్లో, ఎంఐఎం ఆరు నుంచి ఏడు స్థానాలు, టీడీపీ ఐదు నుంచి ఆరు స్థానాలు, బీజేపీ మూడు స్థానాల్లో గెలుస్తాయని సర్వేలో తేలినట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ మద్దతుదారులు మాత్రం దీనికి భిన్నంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీని ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి 61 సీట్లు వస్తాయని, మేజిక్ ఫిగర్ స్పష్టంగా ఉందని తేలిందని పేర్కొంటున్నారు. మజ్లిస్ పార్టీకి ఏడు, టీడీపీకి మూడు, బీజేపీకి మూడు, సీపీఐకి రెండు, సీపీఎంకు ఒకటి, ఇతరులకు మూడు సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైందని వారు పేర్కొంటున్నారు. ఇది నిజమో కాదో తెలియదు కానీ, ఎవరికి తోచినట్లు వారు మార్చుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.