తెలంగాణ నుంచే పోటీ – ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌నం

ఆంధ్రా ఆక్టోప‌స్ ఆయ‌న పేరు. ఎన్నికలు అనగానే రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆసక్తిగా ఆయ‌న స‌ర్వేల కోసం ఎదురు చూస్తుంటారు. ఆయ‌నే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సర్వే. గతంలో చాలా సందర్భాల్లో లగడపాటి చెప్పింది చెప్పినట్టుగానే ఫలితాలొచ్చాయ్‌. అందుకే దీన్ని చాలా మంది క్యాష్‌ చేసుకుంటున్నారు. ‘ఇది లగడపాటి సర్వే’ అంటూ సోషల్‌ మీడియాలో చాలా సర్వేలు చక్కర్లు కొడుతుండడంతో ఆయన స్పందించారు. సోషల్‌ మీడియాలో చెబుతున్నట్టుగా ఆ సర్వేలతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన బృందం చేసిన సర్వే వివరాలు డిసెంబర్‌ 7న ఎన్నికలయ్యాక ప్రకటిస్తానని లగడపాటి చెప్పారు. పార్టీలు కోరితే ముందుగానే వెల్లడిస్తానన్నారు. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడిని ఖండిస్తున్నట్టు తెలిపిన ల‌గ‌డ‌పాటి ఎవరిపై దాడి జరిగినా ఖండించాల్సిందేనన్నారు.

ఒకింత గ్యాప్ త‌ర్వాత ఢిల్లీలో పలు అంశాలపై ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ – టీడీపీ పొత్తుపై స్పందిస్తూ
రాజకీయ ప్రత్యర్థులు కలవడం అరుదుగానే జరుగుతుంటుందని అయితే, పరిస్థితులను బట్టి రాజకీయాల్లో పొత్తులు ఉంటాయని వ్యాఖ్యానించారు. బిహార్‌లో బద్ధ విరోధులు కూడా కలిశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌లే టీడీపీ- కాంగ్రెస్ పొత్తుపై స్పందించాల‌న్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, వాటి గురించి ఇప్పుడేం మాట్లాడినా తాను రాజకీయంగా ఏదో ఆశించే ఇలా మాట్లాడుతున్నట్టు భావించే అవకాశం ఉందన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, టికెట్ల పంపిణీ, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారో తెలిస్తే ఓ అంచనాకు రావొచ్చన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల మ‌నోభావాల గురించి స‌ర్వేచేసి డిసెంబ‌ర్ 7వ‌ తేదీన వెల్ల‌డించ‌నున్న‌ట్లు ల‌గ‌డ‌పాటి తెలిపారు. ఒక‌వేళ పార్టీలు కోరితే ముందుగాన ప్ర‌క‌టిస్తాన‌న్నారు. తన రాజకీయ భవితవ్యంపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భావోద్వేగాలను అడ్డుపెట్టుకొని ఎదగకూడదనే తాను రాజకీయాల్లోంచి తప్పుకున్నానని ల‌గ‌డ‌పాటి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్నికల్లో పోటీచేయనని, అవకాశం వస్తే తెలంగాణలో ఎంపీగా పోటీచేస్తానని ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. మెదక్‌జిల్లాకు వెళ్లినప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలని అక్కడి ప్రజలు తనను అడిగారని తెలిపారు. కాగా ముఖ్మ‌యంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో పోటీ చేసేందుకు ఆస‌క్తిని తెల‌ప‌డం ద్వారా ల‌గ‌డ‌పాటి కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.