కూటమి హవాతో కుంగిపోతున్న టీఆర్ఎస్?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్‌ఎస్‌లో ఆందోళన పెరుగుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహా కూటమికి రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరగడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మొత్తం 119 స్థానాలు ఉన్న తెలంగాణలో 12 నుంచి 15 సీట్లలో పోటీ చేసే టీడీపీ.. మహాకూటమి అధికారంలోకి వచ్చిన పక్షంలో హోం, నీటి పారుదల శాఖ అడుగుతుందని టీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం చూస్తుంటే టీఆర్ఎస్ లో భయం అలముకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు ఇంత వరకూ మహాకూటమిలో భాగస్వామ్య పార్టీలకు ఇచ్చే సీట్ల సంఖ్య ఎంతో కూడా తేలనేలేదు. ఇటువంటి సందర్బంలో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతాడని పేర్కొనడం చూస్తుంటే టీఆర్‌ఎస్ నేతలు పరోక్షంగా కూటమినే గెలుస్తుందనే సంకేతాలు ఇస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ కు చాలా నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పైగా ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటేనే కొందరు టీఆర్‌ఎస్ అభ్యర్థులు జంకుతున్నారన్న వాదనలు కూడా ఉన్నాయని సమాచారం. తాజాగా టీఆర్‌ఎస్ పార్టీలో కూడా గ్రూపు తగాదాలు మొదలయ్యాయని భోగట్టా. మంత్రి కేటీఆర్‌కు, పార్టీకి చెందిన మరికొందరు ముఖ్యనాయకులకు ఇటీవలి కాలంలో గ్యాప్ బాగా పెరిగిందని అంటున్నారు.

ఇది గెలుపోటములపై ప్రభావం చూపనుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లతో ఏ రోజైనా టీఆర్ఎస్  చెప్పిన మాటలను పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సచివాలయాన్ని పడగొట్టి, దానిని వేరే ప్రదేశానికి మారుస్తామని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించి నప్పుడు, ప్రతిపక్షాలు ఎందుకని నిలదీసినపుడు టీఆర్ఎస్ అధినేత సరైన సమాధానం ఇవ్వలేదనే విమర్శలు ఈ నాటికీ వెంటాడుతూనే ఉన్నాయి. అలాగే సాగునీటి శాఖలో చోటుచేసుకున్న అవినీతిపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో వ్యవహరించిదనే విమర్శలు ఎదురయ్యాయి. దీంతో ప్రజలకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లిందని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. దీనికితోడు కొద్దీ రోజుల క్రితమే వంద సీట్ల ఖాయమన్నటీఆర్‌ఎస్ నేతలు, ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయని అంటుండటం గమనార్హం. అధికార పార్టీ నుంచి పెరుగుతున్న వలసలు, ఇతర పార్టీలనుండి చేరికలు ఆగిపోవడం మొదలైనవన్నీటీఆర్‌ఎస్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.