క‌ర్నూలు త‌మ్ముళ్లు దారికొచ్చేనా…

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణాంతరం స్థానిక రాజకీయాల్లో పరిస్థితులు మారిపోయాయి. భూమా కుమార్తె.. మంత్రి అఖిలప్రియ, నాగిరెడ్డికి సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు మొదలయ్యాయి. వీరిమధ్య కలహాలు తలెత్తడానికి గల కారణాల సంగతి అటుంచితే.. ఈ ఇద్దరు నేతలు నువ్వా- నేనా అన్నట్లుగా సాగారు. అఖిలప్రియ, సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు వల్ల ఆళ్లగడ్డ టీడీపీలో తీవ్రమైన అలజడి నెలకొన్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు పర్యాయాలు వారిని అమరావతికి పిలిచి రాజీ కుదిర్చారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలవారు బేషజాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ అభివృద్ధిపై దృష్టిసారించారు. మంత్రి అఖిలప్రియ నంద్యాల, అళ్లగడ్డ నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల అమలు, పార్టీని బలోపితం చేయడం వంటి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.ఏవి సుబ్బారెడ్డి సైతం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తెలుగుదేశాన్ని సుబ్బారెడ్డి వీడతారంటూ సాగుతున్న పుకార్లను ఆయన ఖండించారు. పార్టీని బలోపేతం చేయడమే తమ ధ్యేయమని చెప్తున్నారు. ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబుతో రీసెంట్‌గా భేటీ అయినప్పుడు ఏవీ సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తానని హామీ ఇచ్చారట. దీంతో తమ నేతకి నామినేటెడ్ పదవి వస్తుందని ఆయన వర్గీయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీఎంతో భేటీ తర్వాత మంత్రి భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి పంతాలను పక్కనపెట్టి ఎవరి పనిలో వారు ఉన్నారు. దీంతో ఆళ్లగడ్డలో పరిస్ధితులు చక్కబడ్డాయని జిల్లా టీడీపీ నేతలు, భూమా, ఏవిల అనుచరులు భావిస్తున్నారు. 
ఆధిపత్య పోరాటాల్లో కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాలు కూడా అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టిక్కెట్ విషయమై రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య కొంత కాలంగా ఫైట్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ తనకే దక్కుతుందని భరత్ ధీమా వ్యక్తం చేస్తుంటే, లేదు.. లేదు.. మళ్లీ నేనే టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తానని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నమ్మకంగా ఉన్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న టిక్కెట్ గోల కారణంగా స్థానిక తెలుగుదేశం పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఇక కోడుమూరు టీడీపీలో కుమ్ములాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మధ్య రాజుకున్న కలహాల కుంపటి సెగలు రేపుతూనే ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ ఇమేజ్ క్రమేపీ డ్యామేజ్ అవుతోంది.  అటు కర్నూలులో, ఇటు కోడుమూరులో స్వపక్షంలోనే విపక్షం అన్నట్లుగా పరిస్థితులు తయారవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. త్వరలో ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన నేతలతో బాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. టీడీపీ నేతలు దీనికి సంబంధించిన షెడ్యూల్ రూపొందిస్తున్నట్లుగా సమాచారం.
జిల్లాలో కర్నూలు, కోడుమూరే కాదు- మరికొన్నినియోజకవర్గాల్లో కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య వైరం తారస్థాయికి చేరుకుంది. అయితే ఈ విభేదాలను పరిష్కరించడంలో జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు, జిల్లా టీడీపీ పెద్దలు విఫలమయ్యారని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయాచోట్ల వర్గవిభేదాలపై దృష్టిపెట్టినప్పటికీ.. నేతల మధ్య సయోధ్య కుదర్చలేకపోయారన్న టాక్‌ వినిపిస్తోంది. దీంతో సీఎం చంద్రబాబే రంగంలోకి వచ్చి పార్టీలో పరిస్ధితులను చక్కదిద్దాల్సి వస్తోందని కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చంద్రబాబే చూసుకోవాల్సి వస్తే.. మరి జిల్లా టీడీపీ నేతలు ఏమిచేస్తున్నట్లని కొంతమంది ద్వితీయశ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల పదవ తేదీన సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఆళ్లగడ్డ మాదిరిగానే ఇక్కడ కూడా ఎడమొహం- పెడమొహంగా ఉన్న తెలుగు తమ్ముళ్ల మధ్య సయోధ్య కుదురుస్తారని పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. చూద్దాం- ఈ సమస్యకి బాబు చెక్‌ పెడతారో! 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.