కుప్పంలో కలకలం రేపుతున్న సర్వే

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కొద్దిరోజులుగా ఓ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోందట. ఎక్కడి నుంచి వచ్చారో.. ఎందుకు వచ్చారో తెలియదు కానీ, ఇంటింటికీ తిరిగి పలు రకాల ప్రశ్నలు అడుగుతున్నారట ఆ గ్యాంగ్‌లోని సభ్యులు. వాళ్లు అడిగే ప్రశ్నల బట్టి చూస్తే సర్వే చేయడానికి మాత్రం వచ్చారనిపిస్తోందట. అయితే వాళ్లు ఏ పార్టీ తరపున సర్వే చేస్తున్నారు అనే విషయంపై మాత్రం ఎవరికీ క్లారిటీ రావడంలేదట. అయితే సీఎం సొంత నియోజకవర్గం కావడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుందట.

ఎన్నికలకింకా ఏడాది దాకా సమయముంది కానీ.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునందుకుని ఊరూవాడా నవ నిర్మాణ దీక్షలు నడుస్తుండగా, ఆ పార్టీ నాయకులు వేదికలనెక్కి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకుని, ఆ పార్టీకి వైసీపీ అంటకాగుతున్నదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా నియోజకవర్గాల స్థాయిలో వైసీపీ శ్రేణులు సైతం పాదయాత్రలంటూ పల్లెలు చుట్టేస్తున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో సైతం ఇదే పరిస్థితులు నడుస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో కుప్పంలో జరుగుతున్న సర్వే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. వ్యక్తిగత అవసరాలు, ప్రయోజనాలతోపాటు, స్థానిక నాయకుల పనితీరు, ఓట్ల సరళి గురించి కూడా వివరాలు అడుగుతున్నారట. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ సర్వే బృందాలను ప్రతిపక్ష పార్టీయే పంపించిందనే టాక్ వినిపిస్తోంది. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ సర్వే జరపడం ద్వారా.. ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారం చేయవచ్చు అనే ప్లాన్ చేసిందట వైసీపీ. అయితే అక్కడి వైసీపీ నాయకులు మాత్రం అధికార పార్టీయే ఈ సర్వే జరిపిస్తున్నదన్న ప్రచారం చేస్తున్నారు.

నియోజకవర్గంలో ఎటు చూసినా ఎన్నికలిప్పుడే వచ్చేస్తున్నాయా అన్నంతగా ప్రచారపర్వం, నాయకుల హంగామా కనిపిస్తోంది. ఈ సమయంలో.. పదీ పదిహేను రోజుల క్రితం కొందరు యువకులతో కూడిన బృందాలు నియోజకవర్గంలో దిగిపోయాయి. ట్యాబ్‌లు భుజాలకు తగిలించుకుని పల్లెబాట పట్టాయి. నాలుగు మండలాల్లోనూ ఈ బృందాలు సర్వే చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. వ్యక్తిగత, గ్రామ సమస్యలపై పది ప్రశ్నలు అడిగి జనం నుంచి వివరాలు రాబట్టి అప్‌లోడ్‌ చేస్తున్నాయి. అంతేకాక ఎమ్మెల్యే, సీఎం పనితీరు, స్థానిక నాయకత్వం వ్యవహారశైలి, సీఎం ఎవరైతే బాగుంటుంది తదితర ప్రశ్నలన్నింటినీ అడిగి మరీ ట్యాబ్‌లలో నిక్షిప్తం చేస్తున్నాయి. పోలింగ్‌ బూత్‌కు ఇద్దరు చొప్పున యువకులు సర్వే చేస్తున్నారు.

సర్వే బృందాల్లోని కొందరు యువకులు ఇళ్లకు వెళ్లి దౌర్జన్యకరమైన రీతితో ప్రశ్నలు వేయడంతో గ్రామాల్లో జనం తిరగబడుతున్నారు. పైగా ప్రతిపక్ష పార్టీ ఈ సర్వే చేయిస్తున్నదన్న ప్రచారం జరుగుతుండడంతో అధికార పార్టీలోని కార్యకర్తలు అప్రమత్తమవుతున్నారు. సర్వే బృందాలకు సహకరించరాదంటూ సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పోస్ట్‌ అవుతున్నాయి. సర్వే పేరుతో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికార పార్టీకి అప్రదిష్ట తేవడానికి ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తున్నదంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అసలు ఈ సర్వే గోలేంటో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.