మరోసారి ఎంపీగా పోటీ చేయనున్న రెబల్ స్టార్

ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే వార్తల నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమవుతున్నారు. నాయకులు జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అటు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు… ఇటు సొంతంగా తమదైన శైలిలో ఏదొక రూపంలో ప్రజల మధ్య గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ-బీజేపీ కటీఫ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ఏపీ ప్రజల దృష్టిలో దోషిగా మిగిలిని బీజేపీ.. ఆ అపవాదును పొగొట్టుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు నేతలతో అధికార టీడీపీపై ఎదురుదాడి చేయిస్తోంది.

అంతేకాదు టీడీపీ పట్ల మెతగ్గా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయంతో కంభంపాటి హరిబాబును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణకు ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజును తెరపైకి తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన.. ఆయనను వచ్చే ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీకి దింపుతున్నారు. అందుకోసమే రెబల్ స్టార్‌ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నారట. ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు.

2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్ధి గోకరాజు గంగరాజు గెలుపొందారు. టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని కమలం పార్టీకి కేటాయించారు. సిట్టింగ్ స్థానంపై కన్నేసిన బీజేపీ.. మరోసారి అక్కడ జెండా ఎగురవేయాలని డిసైడ్ అయింది. అయితే, అక్కడ మరోసారి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎంపీ గోకరాజు గంగరాజు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే భీమవరానికి చెందిన సినీ నటుడు కృష్ణంరాజును బరిలోకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించిందని, అందుకోసం ఇప్పటి నుంచే ఆయనను గ్రౌండ్ వర్క్ చేయవలసిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించిందని వార్తలు వస్తున్నాయి.

1999లో నర్సాపురం, 2004లో కాకినాడ స్థానాల నుంచి బీజేపీ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, 2004లో భాజపా అధికారానికి దూరం కావడంతో ఆయన బీజేపీకి దూరమై.. అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున 2009లో జరిగిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాక.. కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.